కేంద్రం తాజాగా కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలు గొంతెత్తాయి. ఇదే సమయంలో బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ కూడా విపక్షాలతో గొంతు కలిపింది. ఈ నిరసనలను పరిగణనలోకి తీసుకోని బీజేపీ తమకున్న సభ్యుల బలంతో లోకసభలో బిల్లుకు ఆమోద ముద్ర వేసుకుంది. రాజ్యసభలో తమకు సరిపడ బలం లేకపోయినా ఇతర పార్టీల మీద ఆధారపడి మేజువాని ఓటుతో బిల్లు బీజేపీ బిల్లు పాస్ చేయించుకుంది. దీంతో ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. పంజాబ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఏపీలో అధికార పార్టీ, విపక్ష పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే,
ఆ బాధ్యత తీసుకున్న నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా వైజాగ్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త వ్యవసాయ చట్టం రైతులకు శాపమని ఆవేదనను వ్యక్తం చేశారు. అధికార పార్టీ, టీడీపీ రెండు ఒకే తాను ముక్కలని నిప్పులు చెరిగారు. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్ లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.
ప్రధాని మోడి కాళ్లను జగన్, చంద్రబాబు ఇద్దరూ పట్టుకుంటున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్… చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందని చెప్పారు. ఏపి రాజధాని అమరావతే అని అన్నారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. బీజేపీ తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
పవన్ పై వ్యక్తిగత కామెంట్స్
అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడి నుంచి నారాయణ తన మార్క్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపడం దారుణమని మొదలుపెట్టి పవన్ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో గతంలో బుద్ధిలేక పొత్తుపెట్టుకున్నామని విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్ ప్రధాని మోడీ కాళ్లు మొక్కుతున్నాడని విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం పెట్టుకుంటున్నాడు అంటూ వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేశారు. దీనిపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
పవన్ అభిమానులైతే నారాయణపై తిట్ల దండకాన్ని మొదలెట్టారు. విమర్శలు చేయడం తప్పు కాదు కానీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం దారుణమంటూ నారాయణకు రాజకీయ నిపుణులు హితవు చెప్పారు. నారాయణను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కు మూడు పెళ్లిళ్లు అయిన సంగతి తమకు తెలియదా నారాయణా గారూ? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ పై విమర్శలు చేసే మీరు గతంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ లతో అంటకాగిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ కామెంట్ చేస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిజాయితి గల వ్యక్తీ. సమస్యలపై పోరాటంలో ముందు ఉండే వ్యక్తి గాని అప్పుడప్పుడూ అసందర్భంగా చేసే వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందులలోకి నెట్టుతున్నాయి.