ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు, వ్యాఖ్యాత డీన్ జోన్స్(59) తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐపీఎల్ లో కామెంట్రీ చెప్పేందుకు ఆయన కొద్దీ రోజుల క్రితం ఇండియాకు వచ్చారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న ఆయన పరీక్షలలో నెగటివ్ గా రావడంతో ఇటీవలే ‘బయో బబుల్’లోకి వచ్చారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన కనుమూశారు.
1990-2010ల మధ్య కాలంలో సచిన్, లారా, స్టీవ్ వా, పాంటింగ్ ల స్టార్ ఆటగాళ్ల ఇన్నింగ్స్ లను మనం చూసే ఉంటాం. అందుకే వారిని మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. వీరిలాగే 1980-1990ల మధ్య కొందరు స్టార్ ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్ లతో క్రీడా అభిమానులను అలరించారు. వారి గురించి చెప్పుకోవాలంటే మనం ఆసీస్ ఆటగాడు డీన్ జోన్స్ గురించి చెప్పుకోవలసిందే. జోన్స్ ఆడే కవర్ డ్రైవ్, హుక్ షాట్, లాఫ్టెడ్ షాట్స్, ఆఫ్ డ్రైవ్ లు చూస్తే చాలు అతను ఎంత గొప్ప ఆటగాడని తెలుస్తోంది. 80వ దశకంలో ఆసీస్ జట్టు దుర్బేధ్యమైన జట్టుగా నిలవడంలో డీన్ జోన్స్ ప్రధాన పాత్ర పోషించారు. డేవిడ్ బూన్, జెఫ్ మార్ష్ లతో అతను ఆడిన మెమరబుల్ ఇన్నింగ్స్ లు క్రీడా అభిమానులు మరిచిపోలేరు.
పవర్ ప్లే నిబంధనలు రాకముందే మొదటి 15 ఓవర్లలో హిట్టింగ్ ఎలా చేయాలో అందరికీ జోన్స్ నేర్పారు. చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ లో ఆయన ఆడిన ఇన్నింగ్స్ ను అభిమానులు మరిచిపోలేరు. అనారోగ్యానికి గురికావడంతో జోన్స్ రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ కు వెళ్ళాడు. అక్కడ ఉన్న అప్పటి జట్టు కెప్టెన్ అలెన్ బోర్డర్ ‘ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని ఆట ఆడలే కానీ ఇలా రాకూడదు. ఇలానే వస్తే ఇంటికి వెళ్ళిపో’అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో మరలా క్రీజులోకి వచ్చిన జోన్స్ ఏకంగా 201 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్ చాలా మెమొరబుల్. 80వ దశకంలో జోన్స్ నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ ఆయన పేరిట ఉంది.
ఆసీస్ జట్టు 1987లో జరిగిన వరల్డ్ కప్ గెలవడంలో జోన్స్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ వరల్డ్ కప్ లో 314 పరుగులు చేసిన జోన్స్ టాప్ స్కోరర్ గా నిలిచారు. ‘బూన్-మార్ష్-జోన్స్’ ఈ త్రయాన్ని ఔట్ చేస్తే చాలు మ్యాచ్ గెలుస్తామని ఇతర దేశాల జట్లు అనుకునేవి అంటేనే తెలుస్తుంది జోన్స్ ఎంత గొప్ప ఆటగాడో. గ్రేట్ క్వాలీటీస్ ఉన్న జోన్స్ గ్రౌండ్ లో చాలా దూకుడుగా ఉండేవారు. స్లెడ్జింగ్ కు ఆయన పలుమార్లు దిగడం అంపైరుల నుంచి హెచ్చరికలు రావడం ఆయనకు మాములే. విండీస్ పేసర్ ఆంబ్రోస్ తో వివాదం, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బోథమ్ తో తగువు అభిమానులు మరిచిపోలేరు.
ఆటకు స్వస్తి పలికిన తరువాత వ్యాఖ్యాత అవతారమెత్తిన ఆయన వివాదాల బాట వీడలేదు. సౌత్ ఆఫ్రికా మాజీ ఓపెనర్ హషిమ్ ఆమ్లాపై జాతి వివక్షత వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యాతగా కూడా తప్పుకోవలసిన పరిస్థితి కొనితెచ్చుకున్నాడు. ఇలాంటివి ఓ పార్ట్ గా ఉన్న జోన్స్ కు ఆట పట్ల ఉన్న నిబద్దత మనల్ని మంత్ర ముగ్దులను చేస్తోంది. కెరీర్ లో 52 టెస్టులు ఆడిన జోన్స్ 3631 పరుగులు చేశారు. 164 వన్డేలలో 6068 పరుగులు చేసి బెస్ట్ ఏవరేజ్ నెలకొల్పాడు. 245 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జోన్స్.. 19,188 రన్స్ చేశారు. కేవలం 59 సంవత్సరాలకే కన్నుమూసిన జోన్స్ కు నివాళి. మై చైల్డ్ హుడ్ క్రికెట్ హీరో జోన్స్ కు అల్విదా…