ఈ ఏడాది ఐపీఎల్‌ను అద్భుతంగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆ తర్వాత అనూహ్యంగా వెనకబడి పోయింది. తొలి రెండు మ్యాచ్‌ల విజయాల తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. శనివారం జరగబోయే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఎదుర్కోబోతోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్ కచ్చితంగా గెలవాలి.
వరుస విజయాలతో జోరుమీదున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు పంజాబ్ టీమ్ బ్రేకులేసింది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో కోహ్లీ సేన అప్రమత్తమైంది. ప్లే ఆఫ్స్‌కు చేరువవుతున్న కీలక సమయంలో నిర్లక్ష్యం దరి చేరనీయకూడదని గ్రహించింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు నమోదు చేసిన కోహ్లీ టీమ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో తలపడుతోంది. మరి, ఈ మ్యాచ్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.
బెంగళూరు బలాలు
ఈ సీజన్‌లో బెంగళూరు టీమ్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమైన కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. కీలక ఆటగాడు డివిల్లియర్స్ ఆరంభం నుంచి సత్తా చాటుతున్నాడు. యువ ఆటగాడు దేవదత్ పడిక్కళ్ ఓపెనర్‌గా కుదురుకున్నాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు ఘనవిజయం సాధించింది. అది కోహ్లీ సేనలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. యజువేంద్ర చాహల్ బంతితో చక్కగా రాణిస్తున్నాడు. ఇక, ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ బెంగళూరు టీమ్‌కు కీలక ఆటగాడిగా మారాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
బలహీనతలు
వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీ సేనను గత మ్యాచ్‌లో పంజాబ్ పెద్ద దెబ్బ కొట్టింది. బ్యాట్స్‌మెన్ ఫర్వాలేదనిపించినప్పటికీ బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. అలాగే ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఫామ్‌లో లేకపోవడం ఇబ్బందిగా మారింది. కీలక ఆటగాడు డివిల్లియర్స్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి.
బెంగళూరు టీమ్ (అంచనా)
ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కళ్, కోహ్లీ, డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, క్రిస్ మోరిస్, ఉడాన, నవదీప్ షైనీ, చాహల్, మహ్మద్ సిరాజ్.
రాజస్థాన్ రాయల్స్ బలాలు
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అందుబాటులోకి రావడం స్మిత్ సేనకు ప్లస్ పాయింట్. ఇక, ఓపెనర్ జాస్ బట్లర్ తిరిగి ఫామ్‌లోకి రావడం రాజస్థాన్‌కు కాస్త ఊరట కలిగిస్తోంది. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావాలి. రాహుల్ తెవాటియా ఆల్‌రౌండర్ పాత్రలో చెప్పుకోదగిన స్థాయిలోనే రాణిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో జొఫ్రా ఆర్చర్ ఆకట్టుకుంటున్నాడు.
బలహీనతలు
రాజస్థాన్ టీమ్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలుపొందింది. టాపార్డర్ వైఫల్యం రాజస్థాన్ టీమ్‌లో నైరాశ్యం నింపుతోంది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ వరుస వైఫల్యాలు టీమ్‌ను ఇబ్బందిపెడుతున్నాయి. ఓపెనర్ జాస్ బట్లర్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. అలాగే బౌలింగ్ విభాగం కూడా కలిసికట్టుగా రాణించలేకపోతోంది. యువ ఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, కార్తీక్ త్యాగి, అంకిత్ రాజ్‌పుత్ ఆకట్టుకోలేకపోయారు. ఇక, ఇప్పటికే ఓసారి బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోవడం రాజస్థాన్ టీమ్‌లో నిరాశ నింపుతోంది.
రాజస్థాన్ టీమ్ (అంచనా)
స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, మనన్ వోహ్రా, రాహుల్ తెవాటియా, టామ్ కర్రన్, జొఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, అంకిత్ త్యాగి.
మ్యాచ్ ఫేవరెట్
ప్రస్తుత పరిస్థితులు, బ్యాటింగ్, బౌలింగ్, ర్యాంకింగ్స్.. ఇలా ఏ విభాగంలో చూసినా రాజస్థాన్ కంటే బెంగళూరు జట్టే బలంగా కనబడుతోంది. గత మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూడడంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాలని కృత నిశ్చయంతో ఉంది. రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులూ ఒడ్డాలని రాజస్థాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. మరి, ఏ టీమ్ విజయం సాధిస్తుందో చూడాలి.











