కేంద్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారులకు త్వరలో తీపికబురు అందించనుంది. ప్రస్తుతం ద్విచక్ర, త్రి చక్ర, నాలుగు చక్రాల వాహనాలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. త్వరలో దీన్ని 10 శాతానికి తగ్గించనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన 60వ ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం ( సియామ్) సదస్సులో జవదేకర్ ఈ విషయం తెలియజేశారు.
కరోనా దెబ్బకు ఇప్పటికే వాహనాల తయారీదారులు తీవ్రంగా నష్టపోయారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని కూడా నిలిపివేశాయి. తమను ఆదుకోవాలని వాహనాల ఉత్పత్తిదారులు కొద్దికాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాహనాలపై ఉన్న 28 శాతం పన్నురేటును 10 శాతానికి తగ్గించే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఇప్పటికే జీఎస్టీ దెబ్బకు వాహనాల ధరలు కొండెక్కాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారు కొనుగోలు చేసే ద్విచక్రవాహనాల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి.
దీని ప్రభావంతో అనేక కంపెనీలు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పడ్డాయి. వారి సమస్యను కేంద్రం వద్ద మొర పెట్టుకోవడంతో కొంత కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. అనేక వస్తువులపై జీఎస్టీ శ్లాబులు తరచూ మారుస్తూనే ఉంటారు. అత్యధికంగా 28 శాతం జీఎస్టీలో ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీ యాజమాన్యాలు తమను 10 శాతం శ్లాబులోకి మార్చాలని కోరుతూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
ఆరు రాష్ట్రాల ఎన్నికలే కారణమా?
వాహనాలపై 28 శాతం గరిష్ఠ జీఎస్టీ పన్ను వేసిన కేంద్రం పునరాలోచనలో పడింది. దీని వల్ల కేంద్రం ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. ప్రజలు వాహనాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. కానీ పెరిగిన వాహనాల ధరలతో జనం కొత్త వాహనాల కొనుగోళ్లు భారీగా తగ్గించుకున్నారు. దీంతో కేంద్రానికి రావాల్సిన పన్నులు భారీగా తగ్గిపోయాయి.
అత్యధిక పన్నులు విధించడం వల్ల వినియోగదారులు సెకండ్ హ్యాండ్ బైకులు, కార్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కేంద్రం ఆలోచనలో పడిందని చెప్పవచ్చు. దీనికి తోడు రాబోయే కొద్ది నెలల్లో ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పన్నులు తగ్గించడానికి అది కూడా ఓ కారణం కావచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట లభించనుంది.