డి.ఎస్. రావు.. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన నిర్మాత. ఆయన అసలు పేరు దమాలపాటి శ్రీనివాస్ రావు. సివిల్ ఇంజినీర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారి 18 సినిమాలు నిర్మించారు. నాని, నితిన్, మంచు మనోజ్ వంటి హీరోలతో మంచి సినిమాలు తీశారు. నిర్మాతగా ఉంటూనే కొన్ని సినిమాలలో యాక్ట్ చేసారు కూడా. తన సినీ జీవితం కోసం, సినీ పరిశ్రమ కోసం, రాజకీయాల కోసం కొన్ని ఆసక్తికర విషయాలను మన లియో న్యూస్ తో ఆయన పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- నేను నా జీవితాన్ని ఒక సివిల్ ఇంజినీర్ గా మొదలుపెట్టాను. తక్కువ టైమ్ లో నాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చింది. చిన్నతనం నుండి నాకు సినిమాలపై మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. అసలు నేను నటుడవ్వాలని వచ్చి నిర్మాతను అయ్యాను. నేను నిర్మాతగా 18 సినిమాలు చేశాను. నితిన్ హీరోగా’ద్రోణ’, నానితో ‘పిల్ల జమిందార్’, మంచు మనోజ్ నటించిన ‘mr.నూకయ్య’ మూవీలతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.
- స్టార్ హీరో సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వలన నిర్మాతలకు చాల నష్టం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అదే చిన్న సినిమాల విషయానికి వస్తే ఓటీటీ వలన ఏమి నష్టం ఉండదు. నేను నిర్మాతగా రేణుదేశాయ్ తో ఒక వెబ్ సిరీస్ మొదలు పెడుతున్నాం. ఆమెతో చేస్తున్న వెబ్ సిరీస్ కథ చాల కొత్తగా ఉంటుంది. నితిన్, నానిని మరల ఒక సినిమా చేయమని అడిగాను. కానీ వాళ్ళు చూద్దాం అని చెప్పారు కాని ఎవరు ముందుకు రాలేదు. నేను కూడా ఇంక అడగడం మానేసాను. పదే పదే వాళ్ళ వెనకాల తిరిగి అడిగే అవసరం నాకు లేదు.
- నాకు అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో సినిమా తీయాలని కోరిక ఉండేది కాని ఆ కోరిక తీరలేదు. అందరికన్నా నాకు దర్శకుడు పూరి జగన్నాథ్ స్టైల్ అంటే ఇష్టం. ఆయన సినిమాల్లో ఏమి తీయాలి అని అనుకుంటాడో అదే తీస్తాడు. తక్కువ సమయంలో సినిమాలను తీస్తాడు, ప్రొడ్యూసర్స్ ని సేవ్ చేస్తాడు. అలాగే దర్శకుడు వి.వి. వినాయక్ అంటే కూడా ఇష్టమే. డైరెక్టర్ తేజా నాకు మంచి స్నేహితుడు. ఆయన సినిమాలో నేను విలన్ గా నా నటనా జీవితాన్ని ప్రారంభించాను. ఇప్పటివరకు సుమారు 50 సినిమాల వరకు నటించాను.
- ‘RX 100’ సినిమా కన్నడ రైట్స్ ను తీసుకున్నాను. కానీ ఆ సినిమా నేను చేయలేదు, వేరే వాళ్లకు ఇచ్చేశాను. ప్రస్తుతం నేను సురేష్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నా. టాలివుడ్ లో టాలెంట్ కి కొదవలేదు. మనం మంచి దర్శకులను ఎంచుకోవాలి. నాకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అది చాలు నాకు. అన్ని రంగాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఉంటాయి. సినీ ప్రపంచం రంగుల ప్రపంచం కాబట్టి మీడియా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇక రాజకీయాల సంగతికి వస్తే అదో పెద్ద వ్యాపారంలా తయారైంది. నాకు రాజకీయాల్లోకి రావాలని ఉండేది కాని కొన్ని చేదు అనుభవాలు ఎదురవడం వలన ఆ ఆలోచన విరమించుకున్నాను.
డి.యస్.రావు ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలనుకుంటే కింది వీడియో క్లిక్ చేయండి.