కరోనాకు ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ ల సంయుక్త వ్యాక్సిన్ లను ఇండియాలో ట్రయల్స్ వేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ అనుమతులు పొందింది. ఆ సంస్థ ఇప్పటికే కేంద్ర సాధికారిక సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)లో తమ పేరును నమోదు చేసుకొంది. మొదటి ట్రయల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ రెండో ట్రయిల్ ను లండన్ లో జరిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ కు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. దీంతో తమ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఆపివేస్తున్నట్లు ఆక్స్ ఫర్డ్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిటన్, దక్షిణ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలలో ఈ ట్రయల్స్ ను ఆపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
ఇండియాలో అటువంటి ప్రమాదం లేదని ఇక్కడ ట్రయల్స్ కొనసాగుతాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇండియాలో వేగవంతంగా ట్రయల్స్ పూర్తి చేసి వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సీరమ్ చేసిన ప్రకటన డీసీజీఐకి కోపాన్ని తెచ్చింది. ఇప్పటివరకూ జరిగిన ట్రయల్స్, వాటి ఫలితాల వివరాలను, వాలంటీర్లకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్ లను గురించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందించాలని ఆదేశించింది. తమ నుంచి వచ్చిన ఆదేశాలతో ముందుకెళ్లాలని వారిని హెచ్చరించింది. గతంలో కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇలాంటి విషయాలతోనే వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే.
సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలె చేసిన కామెంట్స్ విమర్శలకు గురయింది. కరోనాకు వ్యాక్సిన్ వస్తే మొదట పార్సీలకు మాత్రమే ఇస్తామని ఆయన చేసిన ట్వీట్ సంచలాన్ని రేపింది. దీంతో సీరమ్ కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనను విడుదల చేశారు. తన సహచరుడితో పూనావాలె కామెడీగా చేసిన ఈ ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకోవద్దని వ్యాక్సిన్ ను తాము సరఫరా చేయమని కేంద్రమే సరఫరా చేస్తుందని స్పష్టం చేసింది. కరోనాకు వ్యాక్సిన్ ను తయారు చేసి మార్కెట్ లో అగ్రగామి కావాలనుకుంటున్న అనేక కంపెనీలకు డీసీజీఐ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థకు కూడా డీసీజీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో బాబా రాందేవ్ తాము విడుదల చేసిన కిట్ ‘ఇమ్మ్యూనిటి బూస్టర్’గా పని చేస్తుందని వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది.











