ప్రపంచాన్ని లాక్ డౌన్ చేసింది. భౌతిక దూరం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి సాధారణ ప్రక్రియలను తారక మంత్రాలుగా మార్చింది. అఖండమైన ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది. అధికారక లెక్కల ప్రకారం, నేటికి (నవంబర్ 17) ఈ కరోనా మహమ్మారి జన్మించి ఏడాది కాలం పూర్తి చేసుకుంది.
చైనాలో పుట్టింది… ఖండాలను చుట్టింది…
వాణిజ్య రంగంలో, టెక్నాలజీ పరంగా అగ్రగామిగా వెలుగొందుతోన్న దేశాలలో చైనా పేరు తప్పక ఉంటుంది. అలాంటి అత్యాధునిక రంగానికి ఆలవాలమైన దేశంలో ఈ కరోనా మహమ్మారి ఎలా పుట్టికొచ్చిందనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్ధకమైన విషయమే. దీనిని ప్రయోగశాలలో రూపొందించారని కొందరు అభిప్రాయపడుతున్నా, ఆధారాలు లేని ఆరోపణలుగా మిగిలిపోయాయి. చైనాలో పుట్టి, అక్కడితో ఆగిందా… దావానలంలా ఖండాలను చుట్ట బెట్టింది. ప్రస్తుతం కరోనా కాలు మోపని దేశమనేది ప్రపంచంలోనే లేదు.
Must Read: నాడు హుద్ హుద్.. నేడు కరోనా
నవంబర్ 17న పురుడుపోసుకుంది.
చైనా పత్రికల సమాచారం ప్రకారం, చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ లో 2019 నవంబర్ 17వ తేదీన 55 సంవత్సరాల వ్యక్తితో ఈ కరోనా ప్రస్థానం మొదలైంది. కానీ డబ్ల్యూహెచ్ వో లెక్కల ప్రకారం 2019 డిసెంబర్ 8న మొదటి అధికారక కేసు నమోదైంది. ఆ క్షణం నుండి కేసులు అప్రతిహతంగా పెరిగాయి. డిసెంబర్ 27న హుబెయ్ లోని డాక్టర్ ఇది కొత్త తరహా వైరస్ గా గుర్తించాడు. కానీ, దాన్ని గుర్తించిన డాక్టర్ సైతం కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఇలా ఏడాదిగా మానవ జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.
లక్షల్లో బలితీసుకుంది.
కంటికి కనిపించదు… కానీ దాని వల్ల కలిగిన నష్టం మాటల్లో వర్ణంపరానిది. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారి బాధ కనీసం ఊహించనలవికానిది. కరోనా నుండి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లు సైతం వేల సంఖ్యలో ఈ మహమ్మారికి బలవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేసుల సంఖ్య కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా… కరోనా కేసుల విషయంలో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో ఒక్కరోజులోనే దాదాపు 70,000 వేల మంది కరోనా కారణంగా హాస్పిటల్ లో చేరారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఊహించవచ్చు. ఒక్క అమెరికాలోనే కరోనా మరణాలు 2.5 లక్షలు దాటటం ఆందోళన కలిగిస్తున్న విషయం. అమెరికా తర్వాత భారత్, ఇటలీ లలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో ఉన్నాయి.
విముక్తి ఏనాటికో
ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కటై కోరుకుంటున్న విషయం ‘కరోనా నుంచి విముక్తి’. ప్రపంచ దిగ్గజ కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్ లో పరిశోధనల దశలో ఉంటే… మరికొన్ని క్లినికల్ ట్రయిల్స్ ఒక్కొక్క దశను దాటుకుంటూ వస్తున్నాయి. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న మరొక సమస్య, మందు కనిపెట్టినా… కరోనాను అంతం చేయగలమా? దీనికి సమాధానం కాలం మాత్రమే చెప్పగలదు. కానీ, ఎటువంటి కఠినమైనా సమస్య అయినా కాల గతిలో కనుమరుగవక తప్పదనేది అక్షర సత్యం. అదే కరోనాకు కూడా వర్తిస్తుందనేది ప్రపంచంలోకి చాలామంది అభిప్రాయం.
Also Read: పరీక్షల పరిమాణం సగానికి తగ్గింపు.. భారత్ బయోటెక్ కీలక నిర్ణయం











