జీవితం అందమైన కల కాదు .. ఆనందంగా సాగే పాట కాదు .. సాఫీగా సాగిపోయే బాట కాదు. ఆకాశాన్ని మేఘాలు కమ్ముకున్నంత తేలికగా .. కడలిలో కెరటాలు ఎగసిపడేంత సహజంగా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి.
ఆశలను ఆవిరి చేసేందుకు అవమానాలు .. ఆశయాలను నీరుగార్చేందుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో అలాంటి అవరోధాలను అధిగమించినవారే విజయాలను సాధిస్తారు .. విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతలతో ఒకరిగా అక్కినేని నాగేశ్వరరావు కనిపిస్తారు. అక్కినేని అనేది కేవలం ఇంటిపేరు మాత్రమే కాదు .. అది అపజయానికి విరుగుడు మందు .. నవరసాలతో వండి వడ్డించిన విందు. అక్కినేని పెద్దగా చదువుకోలేదు .. అనుకున్నది సాధించడానికి అదో లోపంగా ఆయన భావించనూ లేదు.
‘ప్రపంచమే ఒక పాఠశాల .. అనుభవాలే పాఠాలు’ అని నమ్మిన వ్యక్తి ఆయన. అందుకే ఆయనను కదిలిస్తే చాలు .. కదిలే గ్రంథాలయంలా కనిపిస్తారు. బలహీనతలను బలంగా మార్చుకుని ఎలా ముందుకు వెళ్లాలనేది వినిపిస్తారు. జీవితమంటే .. తెలియని విషయాలను తెలుసుకుంటూ వెళ్లడమేననే సులభమైనసూత్రాన్ని చెప్పేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు .. కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని ‘రామాపురం’అనే గ్రామంలో 1924లో జన్మించారు.ఊహతెలిసిన దగ్గర నుంచి ఆయన నటనపట్ల ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. స్టేజ్ పై నాటకాలు వేసేవారు .. ఎక్కువగా స్త్రీ పాత్రల ద్వారా ఆయన ప్రేక్షకులను మెప్పించడం విశేషం.
Must Read ;- అక్కినేని ఎవర్ గ్రీన్ హిట్ ‘దసరాబుల్లోడు’ చిత్రానికి 50 ఏళ్లు
అలా నటనపట్ల గల ఆసక్తే ఆయనను సినిమాల వైపుకు నడిపించింది. అవస్థలను కూడా ఆనందంగానే అనుభవిస్తూ అవకాశాల కోసం తిరిగేలా చేసింది. అలా కొంతకాలానికి ‘ధర్మపత్ని’ అనే సినిమాలో ఒక చిన్నవేశం సంపాదించగలిగారు. అలా 40వ దశకంలో నటుడిగా తెరపై తొలిసారిగా కనిపించిన ఆయనకి, ప్రముఖ దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య కథానాయకుడిగా అవకాశం ఇచ్చారు .. ఆ సినిమా పేరే ‘సీతారామజననం’. ఈ దశకంలో ఆయన చేసిన ‘బాలరాజు’ .. ‘కీలుగుర్రం’ సినిమాలు అనూహ్యమైన విజయాలను సాధించాయి. అయితే ఈ రెండూ కూడా జానపదాలు కావడంతో,
అక్కినేని సాంఘికాలకు పనికొస్తారా? విషాదపరమైన పాత్రలు .. కామెడీ చేయగలుగుతారా? అనే చర్చలు ఆనాటి ఇండస్ట్రీలో మొదలయ్యాయి. సాంఘిక చిత్రాలకి కూడా తాను సెట్ అవుతాననీ, ఎమోషన్ ను .. కామెడీని కూడా పండించగలననే విషయాన్ని నిరూపిస్తూ, ఆయన ‘సంసారం’ .. ‘దేవదాసు’ .. ‘మిస్సమ్మ‘ సినిమాలు చేశారు. అంతే .. ఆ సినిమాలు సాధించిన విజయాలతో అక్కినేని వెనుదిరిగి చూసుకోలేదు. తొలినాళ్లలో అక్కినేని చేసిన ‘దేవదాసు’ పాత్రను, ఆ తరువాత ఆ స్థాయిలో ఎవరూ పండించలేకపోవడం విశేషం. తాగుబోతు పాత్రలను అక్కినేనిలా చేయడం మరొకరికి సాధ్యం కాదనే ముద్ర ఆ సినిమా నుంచే పడిపోయింది.
‘దొంగరాముడు’ .. ‘పెళ్లికానుక’ .. ‘బాటసారి’ .. ‘ఆత్మబలం’ .. ‘మురళీకృష్ణ’ .. ‘మూగమనసులు’ .. ‘డాక్టర్ చక్రవర్తి’ .. ‘దసరాబుల్లోడు’ .. ‘ప్రేమనగర్’ .. ‘ప్రేమాభిషేకం’ .. సినిమాలు అక్కినేని కెరియర్లో మేలైన మైలురాళ్లు అనే చెప్పాలి. పంచెకట్టి .. తలకి పాగా చుట్టి .. చేత కర్రబడితే ఆయనను మించిన పల్లెటూరి బుల్లోడు లేడు. టక్ చేసి .. స్టైల్ గా సిగరెట్ వెలిగిస్తే ఆయనంత స్టైలీష్ హీరో లేడు అన్నతంగా ఆయన ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆయన పంచెకట్టును .. మీసకట్టును అప్పట్లో అనుసరించనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక డాన్సుల్లోను తనదైన ముద్రవేసిన తొలితరం హీరో అక్కినేని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక పౌరాణికాల్లోను ఆయన తనదైన ముద్రవేశారు. ‘మాయాబజార్’లో అభిమన్యుడిగా .. ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో అర్జునుడుగా .. ‘భూకైలాస్’లో నారద మహర్షిగా .. ‘చెంచులక్ష్మీ’లో విష్ణుమూర్తిగా ఆయన నటన అసమానం .. అనితర సాధ్యం. ఇక ‘తెనాలి రామకృష్ణ’ .. ‘విప్రనారాయణ’ .. ‘మహాకవి కాళిదాసు’ .. ‘భక్త జయదేవ’ .. ‘భక్తతుకారం’ .. ‘చక్రధారి’ వంటి సినిమాలు అక్కినేని కెరియర్లో ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి .. విశిష్టమైనవిగా నిలుస్తాయి. ఆ తరువాత కాలంలో ఆయన చేసిన ‘మేఘసందేశం’ .. ‘సూత్రధారులు’ .. ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాలు మనసున్న ప్రతి మనిషినీ గెలుస్తాయి. ఆయన సినిమాలు కొత్తతరం నటులకు పఠన గ్రంథాలు .. ఆయన పోషించిన పాత్రలు నిత్య పాఠాలు.
Also Read ;- వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)
నటుడిగా అక్కినేని చేసిన ప్రయాణం గురించి సంక్షిప్తంగా చెప్పుకోవచ్చుగానీ, ఆయన చేసిన సినిమాలను గురించి .. ఆయన పోషించిన పాత్రలను గురించి విపులంగా చెప్పుకోవడం కష్టం. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అది సూర్యుడికో నమస్కారం వంటిదే .. చంద్రుడికో నూలుపోగులాంటిదే అవుతుంది. నటుడిగానే కాదు నిర్మాతగాను ఆయన ‘అన్నపూర్ణ స్టూడియోస్‘ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించారు. ఆయన ప్రతిభాపాటవాలకు తగిన సత్కారంగా ‘పద్మశ్రీ’ .. ‘పద్మభూషణ్’ .. ‘పద్మవిభూషణ్’ .. ‘రఘుపతి వెంకయ్య’ .. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డులు దక్కాయి. రేపు ఆయన వర్ధంతి .. ఈ సందర్భంగా ఆ నట మహర్షిని ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
– పెద్దింటి గోపీకృష్ణ











