దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు ఇప్పటికీ స్వేచ్ఛ, స్వతంత్రం లేకుండా పోయాయి. మంత్రాలయం నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం రాంపురంతో పాటు ఏడు గ్రామాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో.. ఆ ఊళ్లలో జనాలు ఇళ్లకు తలుపులు వేసుకొని బయటకు రాకుండా లోపలే ఉండిపోవడం విస్మయం కలిగించింది.
వైసీపీ జడ్పీటీసీ అభ్యర్ధి సొంతూర్లోనూ టీడీపీ నేతల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రోడ్డుకి అడ్డంగా చెట్టు మొదళ్లు, రాళ్లు పెట్టారు. పోలీసులు అడ్డంకులను తొలగించినా.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు వచ్చిన సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకొన్నారని తెలుస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేయాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతంలో వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని అర్ధమవుతుంది.
తమకు బలం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యర్ధులను పోటీ చేయనివ్వకుండా చేయడం.. పోటీలో ఉన్నా ప్రచారాన్ని అడ్డుకోవడం వైసీపీ నాయకులకు అలవాటైన విద్య. ప్రత్యర్ధులకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పే గొడ్డలి పార్టీ నాయకులు.. తమకు బలం ఉన్న చోట ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అడ్డగోలుగా పెత్తనం చేస్తారని చెప్పడానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
ఎన్నో ఏళ్ల నుంచి ఈ గ్రామాల్లో ప్రత్యర్ధులు కనీసం ప్రచారం చేయకుండా అడ్డుకొంటున్నారు. ఈసారి ఆ ఏడు గ్రామాల్లో ప్రచారం చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించడంతో నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా స్వేచ్ఛగా తిరగలేని వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీ అభ్యర్ధులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కుదిరితే దౌర్జన్యాలు చేయడం.. కుదరకపోతే దొంగ ఏడుపులతో సానుభూతి కోసం ప్రయత్నించే వైసీపీ నాయకుల డబుల్ యాక్షన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.











