అక్రమంగా నిర్మిస్తే ప్రతిపక్షంలోని వారి కార్యాలయాలను కూల్చడం సర్వసాధారణమైన విషయం. కానీ వరంగల్లో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కార్యాలయం కూల్చి వేసి అధికారులు షాక్ ఇచ్చారు. కెటిఆర్ ఆదేశాలతోనే కార్యాలయాన్ని అధికారులు కూల్చివేసినట్లు తెలిసింది. నాలాల విస్తరణ, నాలాలపై అక్రమ కట్టడాల నిర్మూలనలో భాగంగా వర్ధన్నపేట అధికార పార్టీ ఎమ్మేల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేశారు. వరంగల్ భద్రకాళి చెరువు నుంచి హంటర్ రోడ్ ప్రధాన రహదారి గుండా వెళ్లే వరదనీటి కాలువపై ఐదేళ్ల కిందట అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం నిర్మించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌లోని పలు కాలనీలు వరద నీటిలో మునిగాయి. అప్పడు మంత్రి కెటిఆర్ వరంగల్ లో పర్యటించిన విషయం తెలిసిందే. నాలాలకు ఆనుకొని ఇబ్బడిముబ్బడిగా వెలసిన అక్రమ నిర్మాణాల కారణంగానే వరంగల్ లో ఆ పరిస్థతి తలెత్తిందని అధికారులు మంత్రి కెటిఆర్ కు నివేధిక ఇచ్చారు. దీంతో అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయండంటూ అధికారులకు మంత్రి ఆదేశించిన విషయయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరదనీటి కాలువపై నిర్మించిన అరూరి రమేశ్ కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు.
అధికార పక్షమైన కూల్చేయండి….
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీనికి కారణం అక్రమ నిర్మాణాలే కారణమని ప్రభుత్వం గుర్తించింది. వెంటనే మంత్రి కేటీఆర్…జిల్లా మంత్రులతో కలిసి రంగంలోకి దిగి వరంగల్ జిల్లాలో పర్యటించారు. నాలాలు, వరద కాల్వల పరిస్థితిని అంచనా వేసి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి కేటిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారపక్షం, ప్రతిపక్షం నేతలను చూడవద్దని సూచించారు. పరిశీలనలో ఎవరైనా అక్రమ నిర్మాణం అని తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాలాలు,చెరువులు వెంట చేపట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేసి, త్వరలో నాలాల విస్తరణ జరపిస్తామని ముంపు బాధితులకు మంత్రి ఆనాడు హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కీలకమైన వరద నీటి కాల్వలను విస్తరించేందుకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను తొలగించేస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే అరూరి క్యాంపు కార్యాలయాన్ని కూల్చేసిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కూల్చివేతకు ముందు రమేశ్ స్పందిస్తూ తన కార్యాలయాన్ని కూల్చి వేసేందుకు సిద్ధమని ప్రకటించారు. పోలీసు బందోబస్తు నడుమ బుధవారం డిఆర్ఎఫ్ టీం కార్యాలయాన్ని కూల్చివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.