ఏపీలో తెలుగుదేశం,బీజేపీ,జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక..అభివృద్ధి పరుగులు పెడుతోంది. పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో పాటు..కొత్త పథకాల అమలుకు సహకరిస్తోంది. ఐతే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దగ్గర ఉన్న శాఖకు సంబంధించిన ఓ కీలక పథకం కోసం ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మేలు జరగనుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దగ్గరే ఉన్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచాయతీల బలోపేతంపై ఫోకస్ పెట్టారు పవన్‌కల్యాణ్. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలు నిధుల్లేక అల్లాడాయి. ఐతే ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రం నుంచి నిధులను ఎప్పటికప్పుడూ గ్రామ పంచాయతీలకు రెగ్యూలర్‌గా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీల బలోపేతానికి మరో కేంద్ర ప్రభుత్వ పథకంలో ఏపీని భాగస్వామిని చేశారు. దీంతో పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి జరగబోతుంది.
కేంద్రప్రభుత్వం పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి కోసం వికసిత్ పంచాయత్ కర్మయోగి పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, అస్సాం, ఒడిశాల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకానికి పవన్ చొరవతో ఏపీని సైతం ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న 15 పంచాయతీలను ఎంపిక చేశారు.దీంతో ఈ పంచాయతీల్లో అధికార విక్రేంద్రీకరణ, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఏఐ వాడకం వంటి చర్యలు తీసుకుంటారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 15 పంచాయతీల్లో పాడేరు మండలం కిండంగి, మినుములూరు,గుతులపుట్టు, డోకులూరు, కడెలి, డి.గొందూరు, వంజంగి, హుకుంపేట మండలంలోని మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకే మందా, తాడిపుట్టు ఉన్నాయి. అలాగే జీ మాడుగుల మండలంలోని బోయితిలి కూడా ఉంది. వీటిని వికసిత్ పంచాయత్ పథకం కింద మోడల్ పంచాయతీలుగా డెవలప్ చేయనున్నారు.