‘బిగ్ బాస్ 4’ విజేతను ప్రకటించేది ఈ రోజునే. దాంతో బుల్లితెర ప్రేక్షకులంతా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్న ఫైనల్ ఎపిసోడ్ పై దృష్టి పెట్టారు. మొదటి నుంచి కూడా ‘బిగ్ బాస్ 4’ హౌస్ లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. తమకి ఢోకా లేదనుకున్న పోటీదారులు ఆశ్చర్యపోతూ బయటకి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫలానా వాళ్లు బయటకి రావడం ఖాయమని ఆడియన్స్ దృష్టిలో ఉన్నవాళ్లు చాలావారాల పాటు హౌస్ లోనే కొనసాగిన సందర్భాలూ ఉన్నాయి. ఆనందాలు .. ఆవేశాలు .. ఆవేదనలు .. ఓటములు .. ఓదార్పులు మధ్య ‘బిగ్ బాస్ 4’ చివరి రోజుకి చేరుకుంది.
‘బిగ్ బాస్ 4’ హౌస్ నుంచి ఒక్కక్కరూ వెళ్లిపోగా ‘టాప్ 5’ లో 5 గురు పోటీదారులు నిలిచారు. అఖిల్ .. అభిజిత్ .. సోహెల్ .. హారిక .. అరియానా ఈ జాబితాలో ఉన్నారు. దాంతో ఈ ముగ్గురిలో ‘టాప్ 3’కి వెళ్లేవారు ఎవరనే ఆసక్తి .. విజేతగా నిలిచేవారు ఎవరు? అనే ఆత్రుత అందరిలోను పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ‘టాప్ 5’ నుంచి హారిక ఎలిమినేషన్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆమె ‘టాప్ 3’ ప్లేస్ కి వెళ్లలేకపోయిందని అంటున్నారు. ‘టాప్ 3’ ప్లేస్ కి అభిజిత్ .. సోహెల్ .. అరియనా వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
మొదటి నుంచి కూడా ‘బిగ్ బాస్’ హౌస్ లో చురుకైన పిల్లగా హారిక మంచి మార్కులు కొట్టేసింది. అందం .. అల్లరి కలగలిసిన అమ్మాయిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెంటల్ గాను .. ఫిజికల్ గాను హారిక చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకుంది. తన శక్తి ఉన్నంతవరకూ అబ్బాయిలతో సమానంగా పోరాడే హారిక, తన మనసు గాయపడినప్పుడు చిన్నపిల్లలా ఏడ్చేసేది. తను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలను గురించి చెప్పుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చాలామంది మనసులు చెమ్మగిల్లాయి. అలాంటి హారిక ‘టాప్ 3’ ప్లేస్ కి వెళ్లలేకపోయిందనే వార్త నిజమే అయితే, అది ఆమె అభిమానులకు బాధ కలిగించే విషయమే.
ఈ రోజున ప్రసారం కానున్న ఫైనల్ ఎపిసోడ్ కి నాగచైతన్య .. సాయిపల్లవి వచ్చినట్టు తెలుస్తోంది. ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్స్ లో భాగంగా వాళ్లు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారని అంటున్నారు. ఇక ఈ రోజున ఈ స్టేజ్ పై రాయ్ లక్ష్మీ .. మెహ్రీన్ పెర్ఫార్మ్ చేయనున్నారని అంటున్నారు. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ కి ప్రత్యేక అతిథిగా అనిల్ రావిపూడి హాజరైనట్టుగా చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో అన్ని విషయాలపై క్లారిటీ రానుంది.
Also Read: బిగ్ బాస్ 4 ఫైనల్ విన్నర్ – రన్నర్.. లిస్ట్ ఇదే