కథలు కాపీ కొట్టడం సినిమా రంగంలో కొత్త కాదు. ఆ కాపీ వివాదం ట్విట్టర్ వేదికగా కొనసాగడం మాత్రం కొత్తే. చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి ల కథతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోందన్నది నిన్నటి వార్త. అయితే ఈ కథ తనదే నంటూ దర్శకుడు దేవా కట్టా ప్రకటించడంతో వివాదం ముదిరిపాకాన పడింది. నిజానికి బయోపిక్ లు మీద రైట్స్ ఎవరికి ఉంటాయన్నది మరో ఆలోచించాల్సిన ప్రశ్న. ఇది కథ అయితే కాపీరైట్ ఉంటుందనుకోవచ్చు. కానీ ఈ కథ ఇద్దరి జీవితాలకు సంబంధించింది కదా. సోమవారం రాత్రి (ఆగస్టు 10) దేవా కట్టా చేసిన ట్వీట్‌తో విష్ణు, దేవా కట్టాల మధ్య వివాదం నెలకొంది. ఇది ఎక్కడి దాకా వెళ్లింది అంటే ఎన్టీఆర్ బయోపిక్ దాకా. ‘‘ప్రారంభంలో నేను రాసిన ఓ కథను దొంగలించి సినిమా చేసిన ఓ వ్యక్తి. డిజాస్టర్‌ను చవిచూశాడు. ఈసారి అలా కానివ్వను. 2017లో చంద్రబాబు నాయుడుగారు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగారి రాజకీయ జీవితాలను ఆధారంగా చేసుకుని వారి మధ్య స్నేహం, రాజకీయ వైరం అనే అంశాలతో ఫిక్షనల్‌గా ఓ కథను తయారుచేశా. ఆ కథను రిజిస్టర్ కూడా చేయించాను. ఈ స్క్రిప్ట్‌కు హాలీవుడ్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇన్‌స్పిరేషన్. దీన్ని మూడు భాగాలుగా రాసుకున్నాను. మా లీగల్ టీమ్ ఈ వ్యవహరాన్ని గమనిస్తోంది’’ అంటూ విష్ణు ఇందూరిపై ఆరోపణలు చేశారు దేవా కట్టా. తన ఆలోచనలను విష్ణు ఇందూరి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని, ఇంతకుముందులా తాను సైలెంట్ గా ఉండనని, కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటానని దేవా కట్టా హెచ్చరిస్తున్నారు. ‘2010లోనే జానారెడ్డి కుమారుడితో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుకున్నాం.. కొన్ని కారణాలతో కుదరలేదు. డేట్స్ కుదరకపోవడం.. నేను అనుకున్న రీతిలో కథ లేకపోవడం వల్ల బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ తీయలేదు. ఇదే విషయం విష్ణు ఇందూరి సమక్షంలో బాలకృష్ణకు చెప్పా’ అన్నారు దర్శకుడు దేవా కట్టా.
దీనిపై నిర్మాత విష్ణు ఇందూరి స్పందిస్తూ.. ‘‘గతంలో బాలీవుడ్ సినిమా ‘రాజ్‌నీతి’ తెలుగు రీమేక్ కోసం దేవా కట్టాను కలిశాను. అప్పుడు యన్.టి.ఆర్ బయోపిక్ కథను, స్క్రీన్‌ప్లేతో సహా నేనే దేవా కట్టాకు వివరించాను. నాకు ఎవరి కథలూ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు. దీంతో వివాదం ముదిరింది.
మొదట సినిమాగా తీద్దామనుకున్న ఈ కథను ఆ తర్వాత వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి మార్చానని దేవాకట్టా తెలిపారు. ”నేను దర్శకుడు రాజ్ గురించో లేదా చదరంగం గురించో మాట్లాడటం లేదు. నేను 2015 డిసెంబర్ లో విష్ణు ఇందూరితో జరిగిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ చర్చల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను” అని మరో ట్వీట్ చేసి తాను ఎవరిని ఉద్దేశించి ట్వీట్స్ చేశాడో స్పష్టత ఇచ్చారు దేవా. ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ కట్టా మరోసారి ఈ వివాదంపై స్పందించారు. ‘విష్ణు ఇందూరి ఏ విధంగా అయినా నా ఎఫర్ట్స్ ని నా ఫిక్షనల్ ఆలోచనలను కాపీ చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందది’ అని హెచ్చరించారు. ‘ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా విష్ణు ఇందూరి గురించి చెప్తారని.. తనతో మీటింగ్ జరగకముందే అతని గురించి తనను చాలామంది హెచ్చరించారని.. అబద్ధాలలో బతికే వారు కొన్ని రోజుల్లో అబద్ధాలు చెప్తున్నామనే విషయం కూడా మర్చిపోతుంటారు.. విష్ణు ఇందూరి కూడా అదే విధంగా జీవిస్తున్నాడు’ అన్నారు. ”2015లో హిందీ ‘రాజనీతి’ సినిమాని తెలుగులో రీమేక్ చేయమని అడిగాడు.. ఆ సినిమాని రీమేక్ చేయకుండా కేవలం ఐడియాని తీసుకొని నా సొంత స్క్రిప్ట్ డెవలప్ చేస్తానని చెప్పాను. అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి బేసిక్ ఐడియా చెప్పాను. అప్పుడు మా మధ్య మరో సాక్షి కూడా ఉన్నారు. మూడేళ్ళ తర్వాత నేను చెప్పిన ఐడియాతో వేరే టీమ్ తో స్క్రిప్ట్ రెడీ చేసుకొని నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. ఆ స్క్రిప్ట్ లో నా సోల్ లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. అందులోనూ డేట్స్ క్లాష్ ఉండటం వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేయలేనని డైరెక్టుగా బాలయ్య బాబుకి చెప్పాను” అని దేవా వివరించారు.
”విష్ణు ఇందూరితో జరిగిన సంభాషణకు సంబంధించి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి.. ఏడెనిమిది మీటింగ్స్ కి సంబంధించిన వాట్సాప్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి.. నేను కోర్టు కేసు వేస్తానని ఇప్పుడు దీని గురించి చెప్పడం లేదు. అవతలి వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి నిజం ఇదని మాత్రమే చెప్తున్నాను. నిన్న జరిగిన ఇష్యూ వల్ల నిన్న ట్విట్టర్ లో డేట్ మార్చేశాడు. ఉదయం నుండి మధ్యాహ్నం లోపల విష్ణు ఇందూరి ఇన్ని అవతారాలు ఎత్తుతుంటాడు. మనం గాలి ఎలా పీలుస్తామో అతను మాటలు అలా చెప్తాడు. దానిని నేను ఏమి వ్యతిరేకించడం లేదు. ఎలా బతకాలనేది అతని ఇష్టం. తన చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. తన పరిధిలో పెద్ద విషయాలు జరగొచ్చు. కానీ నాకు తెలిసిన విష్ణు ఇందూరి గురించి నాకు తెలిసిన ప్రపంచానికి చెప్తున్నాను. వైఎస్ఆర్ – సీబీఎన్ ల ఇమేజ్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఎవరైనా వారికి నచ్చినట్లు సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ డిస్కషన్స్ లోకి వచ్చింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ అయినా సినిమా తీయొచ్చు. విష్ణు ఇందూరిని తనకు నచ్చిన విధంగా నచ్చిన వారితో వెబ్ సిరీస్ తీయమని ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ నా ఫిక్షనల్ ఐడియాస్ ని నా క్రియేటివిటీని మాత్రం దొంగిలిస్తే మాత్రం లీగల్ గా వెళ్తానని వార్నింగ్ ఇస్తున్నాను” అని దేవ కట్టా స్పష్టం చేశారు.