కోలీవుడ్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో ధనుశ్ ముందువరుసలో కనిపిస్తాడు. కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఉత్సాహాన్ని చూపుతుంటాడు. సాధ్యమైనంతవరకూ డిఫరెంట్ లుక్ తో కనిపించడానికి ఆసక్తిని చూపుతుంటాడు. అలాంటి ఓ విభిన్నమైన పాత్రలోనే ధనుశ్ మళ్లీ సందడి చేయనున్నాడు. ఆయన తాజా చిత్రంగా ‘జగమే తంతిరమ్‘ రూపొందింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ధనుశ్ సరసన నాయికగా ఐశ్వర్యలక్ష్మీ అలరించనుంది.
నిజానికి ఈ సినిమాను క్రితం ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదాపడుతూ వచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో వదలాలా? థియేటర్లకు పంపించాలా? అనే విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. చివరికి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘నెట్ ఫ్లిక్స్‘ వారు టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి ఇది గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.
ధనుశ్ కి ఇది 40వ సినిమా .. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు . ఆయన మీసకట్టు డిఫరెంట్ గా ఉంది. టీజర్ మొత్తం కూడా బాంబుల మోతలు . తుపాకుల పేలుళ్లతో సాగింది. కామెడీ టచ్ తో పాటు మాస్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా తెలియజెప్పారు. చూస్తుంటే ధనుశ్ కెరియర్లో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకులను పలకరించనుంది.
Must Read ;- హాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాలో ధనుష్