ప్రస్తుతం ఏపీలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారంపై పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార టీడీపీ కూటమి పార్టీలు, విపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ జమానాలో టీటీడీ చైర్మన్లుగా కొనసాగిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు తమదైన రీతిలో స్పందించారు. అయితే జగన్ పాలనలో సాంతం టీటీడీ వ్యవహారాలను పర్యవేక్షించిన ఏవీ ధర్మారెడ్డి మాత్రం .పత్తా లేకుండా పోయారు. అసలు ఆయన ఇంకా ఏపీ సర్వీసులోనే కొనసాగుతున్నారా… లేదంటే తన మాతృ కేడర్ అయిన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారా? అన్నది కూడా తెలియడం లేదు. అసలు ధర్మారెడ్డి దేశంలోనే ఉన్నారా?..లేదంటే దేశం దాటి వెళ్లిపోయి దాక్కున్నారా? అన్న విషయంపైనా స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరితో ధర్మారెడ్డి భేటీ అయ్యారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఇండియన్ సివిల్ సర్వీసుల్లో ఒకటైన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ (ఐడీఈఎస్)కు చెందిన ధర్మారెడ్డి స్వస్థలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామం. ఐడీఈఎస్ అధికారిగా ఢిల్లీలో అడుగుపెట్టిన ధర్మారెడ్డి…క్రమంగా రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఫలితంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా…నాటి కాంగ్రెస్ సర్కారు ధర్మారెడ్డిని ఏరికోరి మరీ టీటీడీ జేఈఓగా పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిన ధర్మారెడ్డిని… జగన్ కూడా తాను సీఎం కాగానే ఏపీకి రప్పించారు. టీటీడీ జేఈవోగా బాధ్యతలు అప్పజెప్పిన జగన్.. ఆ తర్వాత ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కనపెట్టి మరీ ఆయనకు ఏకంగా టీటీడీ ఈవోగా పదవిని కట్టబెట్టారు..టీటీడీ ఈవో హోదాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ధర్మారెడ్డి… అటు విపక్షాలతో పాటుగా ఇటు అధికార వైసీపీ నేతల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. టీటీడీ ఈవో పోస్టు నుంచి తప్పించగా…ధర్మారెడ్డి దాదాపుగా అదృశ్యమయ్యారనే చెప్పాలి.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిన వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. సుప్రీం మార్గదర్శకత్వంలో ఐదుగురు అధికారుల బృందం ఈ వ్యవహారంపై దర్యాప్తు సాగుతోంది. ఈ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సాగుతున్న విషయం తెలిసిందే. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారం అంతకంతకూ తీవ్రతరమవుతున్న వేళ…ధర్మారెడ్డి గుట్టుగా సుజనా చౌదరితో భేటీ అయినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యవహారంలో తప్పు జరిగిందని తేలితే,,ముందుగా శిక్ష పడేది ధర్మారెడ్డికేనని చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ధర్మారెడ్డి… ఈ వ్యవహారం నుంచి తనను బయటపడేయాలని కోరేందుకే సుజనాను కలిసినట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. అయితే ఆదిలో టీడీపీ నేతగా, ఆ తర్వాత బీజేపీ నేతగా కొనసాగుతున్న సుజనా… ధర్మారెడ్డికి ఏ తరహా భరోసా ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. మొత్తంగా వెంకన్న లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఓ వైపున పెద్ద చర్చే సాగుతుండగా… ధర్మారెడ్డి మాత్రం ఇలా గుట్టుచప్పుడు కాకుండా సుజనాను కలవడం మరో ఆసక్తికర చర్చకు తెర లేపింది.