కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు తెరమీదకు వస్తున్నాయి. రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలుకు వెళ్లిన కొన్నిరోజులకే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లంచం తీసుకున్న కేసు విషయంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై కొన్ని రోజులుగా ఏసీబీ విచారణ జరుపుతోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం కలకలంగా మారింది. కుషాయిగూడ, వాసవి శివనగర్ కాలనీలో ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం ధర్మారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను ఏసీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ధర్మారెడ్డి బెయిల్ మీద ఇటీవల వచ్చి ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
తహసీల్దార్ నాగరాజు ద్వారా సుమారు 24 ఎకరాల వరకు నకిలీ పాసు పుస్తకాలను తన పేరు మీద చేయించుకున్నట్లు ధర్మారెడ్డిపై ఆరోపణలున్నాయి. ఆ భూమి దాదాపు రూ.40 కోట్ల వరకు విలువ చేస్తోందని ఏసీబీ అధికారుల అంచనా. ఈ కేసు విచారణలో ఉన్నప్పటికీ కీసర తహసీల్దార్ నాగరాజుతో ధర్మారెడ్డి చేతులు కలిపి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో గతంలో ధర్మారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను ఏసీబీ అరెస్ట్ చేసింది. గత వారం పది రోజుల క్రితం జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ధర్మారెడ్డి ఇవాళ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది.
ముగ్గురిలో ఇద్దరు ఆత్మహత్య..
రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన తహసీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలో ఇద్దరు నిందితులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం పలు అనుమానాలకు తావీస్తోంది. మొదట నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ గుర్తించి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులపైగానే ఈకేసును విచారణను అధికారులు చేపడుతున్నారు. కేసు విచారణలో ఉండగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విచారణ ఎదుర్కొంటున్న మరో వ్యక్తి ధర్మారెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.