పై ఫొటో చూశారా? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దేనిపైనో ఎక్కి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. రేవంత్ ఎక్కింది ఏ స్టూలో, బెంచో కాదు.. దున్నపోతు. దున్నపైకి ఎక్కి.. దున్న వీపుపై నిలబడి మరీ ఆయన అభివాదం చేస్తున్నారు. అయితే దున్నపై అలా నిలుచుని పడిపోకుండా ఉండాలంటే.. పట్టు చిక్కాలి కదా. ఏ ఆసరా లేకుండా దున్నపై అలా నిలబడాలంటే తప్పనిసరిగా శిక్షణ తీసుకుని ఉండాలి. అయితే రాజకీయ వేత్త అయిన రేవంత్‌కు ఈ విద్యలెలా అబ్బుతాయి? అందుకే కాబోలు.. కార్యకర్తల అభీష్ఠాన్ని కాదనలేక దున్నపైకి ఎక్కిన రేవంత్ పట్టు కోసం అటు వైపు ఓ వ్యక్తి, ఇటువైపు మరో వ్యక్తి చేతులు ఇచ్చి ఆసరాగా నిలిస్తే తప్పించి.. నిటారుగా నిలబడగలిగారు. లేదంటే.. కింద పడిపోతారు కదా. ఇలాంటి ప్రమాదం ఉందని ముందే గ్రహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) దున్నపైకి ఎక్కినా.. నిలబడే సాహసం మాత్రం చేయలేకపోయారు. నగరంలో వేడుకగా నిర్వహించే సదర్ వేడుకకు రావాలంటూ రేవంత్, జగ్గారెడ్డిలను ఆహ్వానించేందుకు సోమవారం నాడు గాంధీ భవన్‌కు వచ్చిన నిర్వాహకులు తమతో పాటు వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచే దున్నలను కూడా వెంట తీసుకుని వచ్చారు. కార్యకర్తల కోరిక మేరకు ఈ దున్నలపైకి ఎక్కిన రేవంత్, జగ్గారెడ్డిలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అందరూ సహకరిస్తున్నట్టేనా?
టీపీసీసీ చీఫ్ ఎంపిక సందర్భంగా పార్టీకి చెందిన చాలా మంది నేతలు టాప్ పోస్ట్ కోసం తమదైన శైలి యత్నాలు చేశారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వి.హన్మంతరావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సరిపెట్టుకున్న జగ్గారెడ్డి సహా దాదాపుగా డజను మందికి పైగానే ఈ పదవి కోసం తమదైన శైలి యత్నాలు చేశారు. అయితే ఉరిమే ఉత్సాహం తనదంటూ పార్టీ అధిష్ఠానాన్ని మెప్పించి ఒప్పించిన రేవంత్.. అందరినీ దాటేసుకుని టాప్ పోస్ట్‌ను దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆ పదవి కోసం యత్నించిన వారిలో ఏ ఒక్కరు కూడా రేవంత్‌కు సహకరించరనే వాదనలే వినిపించాయి. అయితే ఆ వాదనలను పటాపంచలు చేస్తూ రేవంత్ చాలా మంది నేతలు తనతో కలిసి నడిచేలా చేసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా మిగిలిన వారంతా రేవంత్ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా అంగీకరించినట్లేనని ఇటీవలి పరిణామాలే చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోయినా.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో సంతృప్తి చెందిన జగ్గారెడ్డి అయితే నిత్యం రేవంత్ వెన్నంటే నడుస్తున్నారనే చెప్పాలి. సోమవారం నాటి గాంధీ భవన్ సమావేశానికి వీహెచ్ కూడా హాజరై.. రేవంత్‌తో సఖ్యతగానే మెలిగారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తే.. ఇక అంతా రేవంత్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ మంత్రం ఫలించేనా?
తెలుగు రాష్ట్రాల్లో అమితాసక్తి రేకెత్తించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ను ఎంపిక చేసిన తీరుపై ఆదిలో విమర్శలు రేకెత్తాయి. అయితే బల్మూరినే ఎందుకు ఎంపిక చేసుకున్నామన్న వాదనను రేవంత్ నోట నుంచి విన్న తర్వాత తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ సరైన ట్రాక్‌లోనే నడుస్తోందని భావిస్తోంది. పార్టీ కోసం, పార్టీ తరఫున ప్రజల కోసం పోరాటం సాగించిన నేతలను పార్టీ విస్మరించదని, అలాంటి నేతలు ఏ ఒక్కరిని టికెట్ కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదని, వారి ఇంటికే వెళ్లి టికెట్లు ఇస్తామని రేవంత్ చెప్పారు. వాస్తవానికి ఏ పార్టీకి అయినా ఇది తారక మంత్రమేనని చెప్పక తప్పదు. అయితే అటు అధికార పార్టీ, ఇటు బలంగా ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ల మధ్య బల్మూరిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసిందన్న మాట అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. కొండా సురేఖ లాంటి అభ్యర్థులను నిలిపి ఉంటే.. ఇటు టీఆర్ఎస్తో పాటు అటు బీజేపీకి కూడా చుక్కలు కనిపించేవన్న వాదనలు లేకపోలేదు. అయితే ఆ రెండు పార్టీలకు ఇబ్బంది కలిగించే కంటే కూడా పార్టీ పురోభివృద్ధే లక్ష్యంగా బల్మూరిని ఎంపిక చేసుకున్న రేవంత్ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనన్న విషయంపై ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.