Did TDP Strengthen MLA Pinnelli Ramakrishna Reddy In Macherla :
గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట. ఆ జిల్లాలోని మాచెర్ల నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట కిందే లెక్క. అయితే 2004 నుంచి ఆ నియోజకవర్గంపై టీడీపీ పట్టు సడలింది. 2004 నుంచి 2019 దాకా మొత్తంగా ఐదు సార్లు ఆ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే.. ఒక్కటంటే ఒక్క ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిన్నెల్లి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తే.. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఆయన కుమారుడు, ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డే విజయం సాధిస్తూ వస్తున్నారు. వెరసి టీడీపీకి కంచుకోటగా కొనసాగిన మాచెర్లపై పిన్నెల్లి కుటుంబం పట్టు సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ టీడీపీ నేతలు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఇందుకు నిదర్శనమే ఇటీవలి పరిషత్ ఎన్నికల ఫలితాలు. నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలోని చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ.. రెండు నియోజకవర్గాలను మాత్రం క్లీన్ స్వీప్ చేసింది. వాటిలో ఒకటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు అయితే.. పిన్నెల్లి కబంద హస్తాల్లో చిక్కిన మాచెర్ల మరొకటి. ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల కోసం నామినేషన్లు వేసేందుకు బయటకు వచ్చిన టీడీపీ నేతలను పిన్నెల్లి వర్గం భయభ్రాంతులకు గురి చేసింది. అయితే టీడీపీ నుంచి ఆయా అభ్యర్థులకు కనీస మద్దతు దక్కని వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది.
పిన్నెల్లి చెప్పిందే వేదం..
పరిషత్ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ శ్రేణులు పాల్పడిన దుర్మార్గాలపై ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదిరించిన టీడీపీ శ్రేణులున్నా.. మాచెర్లలో మాత్రం పిన్నెల్లి మాటను కాదని బయటకు వచ్చే టీడీపీ నేత లేరనే చెప్పాలి. ఈ ఒక్క మాటతో మాచెర్లపై పిన్నెల్లి ఏ మేర పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా పిన్నెల్లి మాచెర్లను తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. అధికార యంత్రాంగంతో పాటుగా పోలీసులు కూడా పిన్నెల్లిని ఎదిరించి ఏమీ చేయలేని పరిస్థితి. ఇదేదో విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న మాట ఎంతమాత్రం కాదనే చెప్పాలి. మాచెర్ల నియోజకవర్గంలో అమలు అవుతున్న పోలీసింగ్ ను చూస్తేనే ఈ మాట ఇట్టే అర్థం కాక మానదు. ఇందుకు నిదర్శనంగా మొన్నామధ్య పిన్నెల్లి ఫ్యామిలీ దౌర్జన్యాలను నిరసిస్తూ వైసీపీకి చెందిన ఓ నేత తన నిరసన వ్యక్తం చేస్తే.. ఆయనను బెదిరిస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తండ్రి పిన్నెల్లి లక్ష్మారెడ్డిలు జారీ చేసిన హెచ్చరికల ఫోన్ సంభాషణ కలకలం రేపిన సంగతీ తెలిసిందే. సొంత పార్టీ నేతలకే బెదిరిస్తున్న పిన్నెల్లి ఫ్యామిలీ ఇక విపక్షానికి చెందిన నేతలను బతకనిస్తుందా? అన్న మాట కూడా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.
టీడీపీ వ్యూహంలోనే లోపముందా?
టీడీపీ పురుడు పోసుకున్న తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో మాచెర్లలో ఆ పార్టీ అభ్యర్థిగా సుబ్బారావు విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణమూర్తి విజయం సాధించారు. ఆ వెంటనే 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అక్కడ జెండా ఎగురవేసింది. పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నిమ్మగడ్డ శివరామకృష్ణప్రసాద్ విజయం సాధించగా..1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పున్నారెడ్డి, జూలకంటి దుర్గాంభ విజయం సాధించారు. ఇక 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెల్లి లక్ష్మారెడ్డి నిలబడితే.. టీడీపీ తరఫున దుర్గాంభ కుమారుడు జూలకంటి బ్రహ్మారెడ్డి బరిలోకి దిగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డికి అనుకూలంగా వీచిన గాలిలో పిన్నెల్లి విజయం సాధిస్తే.. టీడీపీ తరఫున పార్టీ కేడర్ కు అండగా బ్రహ్మారెడ్డి నిలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బరిలోకి దిగితే.. టీడీపీ తరఫున బ్రహ్మారెడ్డే నిలిచారు. పిన్నెల్లి మెజారిటీని 30 వేల నుంచి 9 వేలకు పడగొట్టగలిగిన బ్రహ్మారెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జూలకంటినే కొనసాగించి ఉంటే.. పిన్నెల్లికి చెక్ పడేదే. అయితే ఏమైందో తెలియదు గానీ.. 2014లో జూలకంటికి బదులుగా కొమ్మారెడ్డి చలమారెడ్డిని టీడీపీ బరిలోకి దించింది. చలమారెడ్డి కూడా సత్తా చాటి పిన్నెల్లి మెజారిటీని 9 వేల నుంచి 3 వేలకు తగ్గించగలిగారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అటు జూలకంటినో, ఇటు కొమ్మారెడ్డినో అభ్యర్ధిగా ప్రకటించని టీడీపీ.. వారిద్దరికీ బదులుగా కొత్తగా అన్నపురెడ్డి అంజిరెడ్డిని బరలోకి దింపింది. వరుసబెట్టి ముగ్గురు అభ్యర్థులను టీడీపీ మార్చడంతో 2019 ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన మెజారిటీని 3 వేల నుంచి ఏకంగా 22 వేలకు పెంచుకున్నారు. ఇలా టీడీపీ వ్యూహం కారణంగానే పిన్నెల్లి మాచెర్లలో తిరుగులేని నేతగా ఎదిగారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- టీడీపీ వెంటే జనసేన.. కడియం రిజల్టే సాక్ష్యం