తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్… తెలుగు చిత్ర పరిశ్రమకు గుండెకాయ అంటే దీన్నే చెప్పాలి. అందుకే ఈసారి ఈ ఛాంబర్ కు జరగబోయే ఎన్నిల హడావుడి మామాలుగా లేదు. ఓ పక్క దిల్ రాజు ప్యానల్, ఇంకో పక్క సి. కళ్యాణ్ ప్యానల్ హోరాహోరీగా తలపడుతున్నాయి. గ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్, నిర్మాతల సెక్టార్ కలిపితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ సెక్టార్ల నుంచి ఎంపికైన వారితోనే ఛాంబర్ పాలక వర్గం ఏర్పడుతుంది. 44 మంది ఈసీ మెంబర్స్ ఇందులో ఉంటారు.
వీరు కాకుండా ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ లతో ఛాంబర్ పాలకవర్గం ఏర్పడుతుంది. దీనికోసమే ఇప్పుడీ పోరు. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తి కాగా, శుక్రవారంతో అంటే జూలై 21తో నామినేషన్ విత్ డ్రా ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలోనే జూలై 30న ఎన్నికలు జరగనున్నాయి. ఎగ్జిబిటర్ సెక్టార్‌కు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ప్రధానంగా పోటీ దిల్ రాజు, సి కళ్యాణ్ మధ్య కనిపిస్తోంది. ఇద్దరూ ఎవరికి వారు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యారు.
కొన్నాళ్లుగా నిర్మాతల మండలిలో వస్తున్న మార్పులు, కనిపిస్తున్న ఆధిపత్యాలు చూస్తోంటే ఈ ఎన్నికలు మరింత వాడి వేడిని సంతరించుకోబోతున్నాయని అర్థమవుతోంది. సి.కల్యాణ్ ఇప‍్పటికే టాలీవుడ్‌లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గానూ పని చేశారు. మరోవైపు దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకుని ఆ గిల్డ్ లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వీళ‍్లిద్దరి ప్యానెల్స్ ఈ ఎన్నికల్లో తలపడడం ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు ప్రెస్ మీట్స్ పెట్టి తాము చెప్పదలుకున్న విషయాలు చెబుతున్నారు. వీడియో బైట్స్ రిలీజ్ చేస్తున్నారు.
తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టుకోవల్సిన అవసరం మనకుందని దిల్ రాజు అంటున్నారు. దానికి సరైన టీమ్ కావాలని, చిన్న పెద్ద నిర్మాతలను కలుపుకుని ఛాంబర్ ను బలోపేతం చేసుకోవల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడుతున్నారు. చిన్న సినిమాలు తీసేవారికి ప్రాపర్ గైడెన్స్ కావాలి.దానికి ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. ఇక సి. కళ్యాణ్ కూడా తగ్గేదేలే అంటున్నారు. తాను ఏం చేయదలుకున్నానో చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. మొత్తానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సంబంధించి వేడివేడిగా వాతావరణం తయారైంది. రెండు వర్గాలుగా విడిపోయి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.











