ప్రముఖ ఇన్వెస్టర్ దినేష్ పై అమరావతి పర్యటన విశేషాలను వివరిస్తూ What I learnt from a visit to Amaravati అనే టైటిల్‌తో రాసిన కథనం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్పెషల్ పోస్ట్‌పై స్పందిస్తూ మంత్రి లోకేష్ రీట్వీట్ చేశారు. ఈ ఆర్టికల్ చదవడం చాలా ఆనందంగా అనిపించింది. భారతీయ నగరాల నిర్మాణ శైలిని తిరగరాసే సరికొత్త ప్రయోగమే అమరావతి. ఇక్కడికి వచ్చి మేం ఏం నిర్మిస్తున్నామో స్వయంగా చూసి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు దినేష్! అంటూ లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్‌ల స్పష్టమైన ఆలోచనలను దినేష్ తన కథనంలో కొనియాడారు. రాజధాని నిర్మాణంలో రీజినల్ క్లస్టర్లు, ఆవిష్కరణలు, 30-40 శాతం పచ్చదనాన్ని కాపాడాలనే నిర్ణయం అద్భుతమైనదన్నారు. చంద్రబాబులో కనిపించిన ఆత్రుత, పనుల్లో చూపిస్తున్న వేగం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. విమానంలో తిరిగి వెళ్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది..ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు కేవలం సామర్థ్యం కలిగిన మనుషులపై వేసిన ఒక పెద్ద పందెం అని దినేష్ విశ్లేషించారు.
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ప్రక్రియను అమరావతి నిర్మాణంతో పోలుస్తూ దినేష్ పలు కీలక అంశాలను వెల్లడించారు. అమరావతి వంటి మహత్తర ఆశయం ప్రారంభంలో అసాధ్యమైనదిగా అనిపించినా, నాయకుల సామర్థ్యంపై నమ్మకంతోనే అది సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు, లోకేష్లలో ఉన్న స్పష్టమైన ఆలోచనా విధానం, ఎంతటి విపత్తులు ఎదురైనా ఇతరులను బాధ్యులను చేయకుండా కష్టపడే నిజాయితీ, విజనరీ నాయకత్వం అమరావతికి కొండంత అండగా మారాయని పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణం అనేది కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, సరైన నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకమని దినేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న వేగాన్ని, సమర్థవంతమైన పాలనను చూసిన తర్వాత..ఇదే విజన్, నమ్మకంతో ముందుకెళ్తారనే అభిప్రాయం తనకు కలిగిందన్నారు దినేష్.











