అనుకున్నదే అయింది.. దినేష్.కార్తీక్ పై వేటు పడింది. ఆటగాడిగా మాత్రమే గాక కెప్టెన్ గా సత్తా చాటలేకపోతున్న దినేష్ కార్తీక్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. సారీ సారీ కోల్ కతా జట్టు యాజమాన్యం చెప్పినట్లు దినేశ్ కార్తీకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. జట్టుకు మరింతగా సేవలు అందించడమే తన ప్రాధాన్య అంశమని తెలిపాడు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇంత హఠాత్తుగా కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడంపై క్రీడా వర్గాలలో చర్చ జరుగుతోంది.
కార్తీక్ పై విమర్శలు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓనర్ గా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు గంగూలీ, మేక్కల్లమ్ కెప్టెన్సీలో ఐపిఎల్ లో నిరాశాజనకమైన ఆట తీరును కనబరిచింది. దీంతో టీంని సమూలంగా మార్చి షారుఖ్ టీం బాధ్యతలను గౌతమ్ గంబీర్ కు అప్పగించారు. ‘కింగ్ ఖాన్’ తీసుకున్న ఈ నిర్ణయం కోల్ కతా జట్టుకు కలిసి వచ్చింది. ఆ జట్టు రెండు సార్లు విజేతగా నిలిచింది. 2018లో గంబీర్ ఢిల్లీకి ఆడాలని నిర్ణయం తీసుకోవడంతో జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను దినేష్ కార్తీక్ కు అప్పగించారు. దినేష్ కార్తీక్ నేతృత్వంలోని జట్టు రెండు సీజన్లు అంచనాల మేరకు రాణించలేకపోయింది.
తాజా సీజన్ లో ఇప్పటివరకు మెరుగైన ఆటతీరుతో కొనసాగుతోంది.7 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 4 విజయాలతో 8 పాయింట్లు సొంతం చేసుకొని పాయింట్స్ టేబుల్ లో నాలుగవ స్థానంలో నిలిచింది. కార్తీక్ పై ఒత్తిడి పెరగడంతో అతను నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నాడని విమర్శలు ప్రచారం జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్న దినేష్ కార్తీక్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న ఇయాన్ మోర్గాన్ సలహాలు ఇచ్చారు. స్టార్ బౌలర్లను 10 ఓవర్లలలోపు వేయించకుండా ఆ తరువాత వేయించడంతో ఆ మ్యాచ్ లో కోల్ కతా సులువుగా విజయం సాధించింది. ఈ సలహా వెనుక మోర్గాన్ ఉన్నాడు. అందుకే మోర్గాన్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.
మోర్గాన్ ను ఎందుకే
క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ జట్టుకు 2019లో వరల్డ్ కప్ అందించిన ఘనత మోర్గాన్ ది. అందుకే ఈ బాధ్యతలు అప్పగించినట్లు క్రీడా వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా దీనిపై ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ ఓ ప్రకటన చేశారు. దినేశ్ కార్తీక్ వంటి ముందుండి నడిపించే వ్యక్తులు జట్టులో ఉండడం తమ అదృష్టమని పేర్కొన్నారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కార్తీక్ భావించేవాడని తెలిపారు. అతని నిర్ణయం తమను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. కార్తీక్ మనోభావాలను తాము గౌరవిస్తామని, కొత్త కెప్టెన్ గా మోర్గాన్ బాధ్యతలు చేపడుతున్నాడని వెంకీ మైసూర్ వెల్లడించారు.
మోర్గాన్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ ఇవాళ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ తో మోర్గాన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.