కొన్ని జ్ఞాపకాలు మనసులోకి రాగానే మనకు పొలమారుతుంది. ఆ జ్ఞాపకాల ఘాటే అందుకు కారణమేమో. అలా ఎన్నోసార్లు పొలమారగా వంశీ నుంచి పుట్టినవే ఈ పొలమారిన జ్ఞాపకాలు అనుకోవచ్చు.
వంశీ రచనలు జనానికి కొత్తకాదు.. ఆయన సినిమాలూ అంతే. మరి ఆ సినిమా జ్ఞాపకాలు తలచుకుంటే ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. గోదావరి అంటే వంశీ.. వంశీ అంటే గోదావరి. అలాంటి వంశీ రచనల్లోని రసవంతమైన భాష.. దానికి గోదావరి ఎటకారపు ఉంటే ఎంత పసందుగా ఉంటుంది. దర్శకుడు వంశీ సినిమాల్లోకి రాకముందే రచయిత అనే సంగతి ఎంతోమందికి తెలుసు.
మరి అలాంటి వంశీ తన సినిమాలో పాటే తన రచనలనూ జనంలోకి తెచ్చారు.. తెస్తున్నారు. నాటి‘పసలపూడి కథ’ల దగ్గర నుంచి నేటి ‘పొలమారిన జ్ఞాపకాలు’ వరకూ ప్రతి పుస్తకమూ ప్రత్యేకమైనదే. పాత్రల్ని పరిచయం చేసి దానికి హాస్యాన్ని జోడించి కన్నీళ్లు తెప్పించి కథ ముగించడం వంశీగారి స్టయిల్ అంటారు సినీ రచయిత, దర్శకుడు అజయ్ భూపతి. వంశీ తాజా రచన అయిన ‘పొలమారిన జ్ఞాపకాలు’ పుస్తకం మే 1 విడుదలై జనంలోకి వెళ్లిపోయింది.
మల్టీకలర్ ఆర్ట్ పేపర్ లో 700 పేజీలతో ఈ ‘పొలమారిన జ్ఞాపకాలు’ పుస్తకం తయారైంది.
ఇందులో 70 కథలు ఉన్నాయి. ఈ పుస్తకం ప్రచురణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదంటున్నారు వంశీ. పుస్తకానికి అయిన ఖర్చులో సంగం ధరకే దీన్ని అమ్ముతున్నామని వంశీ అంటున్నారు. అంత క్వాలిటీతో ఈ పుస్తకం రూపొందింది. కొందరు మిత్రులు అందించిన ఆర్థిక సహకారం వల్ల తక్కువ ధరకే దీన్ని అమ్మగలుతున్నామని ఆయన చెప్పారు. ఇంతకీ ఆ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 900. అమ్మో ఇంత రేటా.. అనిపిస్తోందా. అలా అనిపించినా పుస్తక ప్రియులు దీన్ని కొనక తప్పడం లేదు. ఎందుకంటే వంశీ పుస్తకాలను వారు అంతగా ప్రేమిస్తారు.
అజయ్ భూపతి మాటల్లో..
సినీ దర్శకుడు, రచయిత అజయ్ భూపతి కూడా గోదావరి జిల్లా వాసే. వంశీ గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లోనే ‘మాది గోదావరికి ఆనుకుని ఉన్న ఆత్రేయపురం. నాకు గోదావరి కొత్తేమీ కాదు. నేను వంశీగారి కథలు చదవడానికి ముందు నా దృష్టిలో గోదారంటే స్నేహితులో, చుట్టాలో వచ్చినప్పుడు చూపించే ఓ ప్రాంతమే. కానీ వంశీ గారి కథలు చదివాక గోదారి మీదున్న నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
నేను ఊరెళ్లిన ప్రతిసారీ గోదావరి గట్టు మీద నుంచుని అలా నది వైపు చూడటం అలవాటైపోయింది. చూస్తున్నంతసేపూ వంశీగారు రాసిన పాత్రలన్నీ ఆ ఇసుక తిన్నెల నుంచి నా వైపునకు నడుచుకొస్తున్న అనుభూతి కలుగుతుంది. భారత దేశంలో ఏ డైరెక్టర్ శైలినైనా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఇద్దరు డైరెక్టర్ల శైలిని మాత్రం ఫాలో కావడం ఎవరివల్లా కాదు. వారిలో ఒకరు ‘బాపు’గారు, ఇంకొకరు‘వంశీ’గారు’ అంటూ కితాబిచ్చారు.
ఇంతకీ ఏముంది ఇందులో?
అసలు ఈ పుస్తకం గురించి అందరూ ఇంతలా ఎందుకు చర్చిస్తున్నారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తను రూపొందించిన 25 సినిమాల ఫాష్ బ్యాక్ స్టోరీస్ తో ఈ పుస్తకం తయారైంది. విశేషం ఏమిటంటే ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందే వేసిన కాపీలన్నీ అమ్ముడైపోవడం. అన్నట్టు దీనికి కూడా సీక్వెల్ ఉందండోయ్. ఈ పుస్తకం రెండో భాగం కూడా విడుదలకు ముస్తాబవుతోంది. సినిమా ప్రముఖులతో పాటు అవకాశాల కోసం చెన్నై చేరిన సగటు జీవుల అనుభవాలను కథలుగా మలిచారు వంశీ.
ఆ కథలే ఈ ‘పొలమారిన జ్ఞాపకాలు’ పుస్తకం. సిల్లీ ఫెలో శ్రీరామ్మూర్తి, బొబ్బిలి కోట.. బొబ్బిలి వీణ, ట్యుటోరియల్ కాలేజీ సాయిరాజు, కుతుకులూరు సత్తిరెడ్డిగారి రెండో అబ్బాయి, పాపికొండల మీద మంటలు.. ఇలాంటి ఎన్నో కథల సమాహారంగా ఈ పుస్తకం రూపొందింది. ఆయన తను చూసిన మనుషుల్ని, ప్రదేశాల్నే సినిమాల్లోనూ చూపారు. వంశీలోని సృజనశీలుడు ఎలా ఉంటాడో ఈ పుస్తకం చదివిన వారికి అర్థమవుతుంది.
-హేమసుందర్
Must Read ;- కాలనీలో దర్శకుడు మారుతి ప్రేమాయణం.. నిజమేనా?