తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. రాజధాని నియోజకవర్గం కావడంతో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేపై సహజంగానే ఫోకస్ ఎక్కవగానే ఉంటుంది. రాజధాని రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ విమర్శించి ఎమ్మెల్యే శ్రీదేవి అభాసు పాలయ్యారు. రాజధాని రైతుల్లో తీవ్ర వ్యతిరేకతను పోగు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు సరికదా, గుండె ఆపరేషన్ చేయించుకున్న రోగి గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటోందంటూ అసెంబ్లీలో ప్రకటించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమెపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి.
రూ.25 కోట్లు వసూళ్ల ఆరోపణలు
తాడికొండ నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు పుష్కలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి ఇవి కల్పతరువులుగా మారాయనేది తాజాగా వినిపిస్తున్న ఆరోపణ. డాక్టర్ శ్రీదేవి భర్త రంగంలోకి దిగి ఇసుక మాఫియా నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిని రంగంలోకి దింపి సంవత్సర కాలంలో రూ.25 కోట్లు వసూలు చేశారని గుసగుసలున్నాయి.
మామూలుగా అయితే పెద్దగా వివాదం ఉండేది కాదు. ఎవరినైతే అక్రమ వసూళ్లకు నియమించారో అతనే రూ.5 కోట్లతో హైదరాబాద్ జంప్ అయ్యారని, దీంతో విషయం బయటకు పొక్కిందని అనుకుంటున్నారు. రూ.25 కోట్లు వసూలు చేయడానికి నాకు రూ.5 కోట్లు ఖర్చయ్యాయంటూ సదరు వ్యక్తి సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే శ్రీదేవి, ఆయన భర్తకు కరెంట్ షాక్ కొట్టినంత పనైందని వినిపిస్తోంది. ఇది మరవక ముందే మరో వివాదం వచ్చి పడింది.
నా వద్ద కోటి 40 లక్షలు తీసుకున్నారు…రవికుమార్
2019 ఎన్నికలకు ముందు తాడికొండ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీదేవి తన వద్ద కోటి 40 లక్షలు అప్పుతీసుకున్నారని ఆమె అనుచరుడు, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ మేకల రవికుమార్ ఆరోపిస్తున్నారు. చాలా సార్లు తిప్పించుకుని రూ.60 లక్షలు ఇచ్చారని మిగిలిన రూ.80 లక్షలు ఇక ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని మేకల రవికుమార్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారింది.
మొదటి నుంచీ ఎమ్మెల్యే అనుచరుడైన రవికుమార్ కు జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ పదవిని శ్రీదేవి ఇప్పించారు. నీకు జిల్లా స్థాయి పదవి కట్టబెట్టాను, ఇక నీవు రూ.80 లక్షలు మరచిపోవాలి అని బెదిరించడంతో రవికుమార్ న్యాయం కోసం సోషల్ మీడియాకు ఎక్కారు. దీంతో వైసీపీ పరువు మరోసారి బజారున పడింది.
వారికి వారే శత్రువులు
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ల మధ్య పోరునడుస్తోంది. నందిగం సురేష్ బాపట్ల నుంచి ఎంపీగా గెలిచినా అతను రాజధానిలో స్థానికుడు కావడంతో ఇక్కడి ఇసుక ర్యాంపులపై దృష్టి పెట్టాడు. అక్రమ వసూళ్లకు దిగడంతో ఎమ్మెల్యే శ్రీదేవికి ఆగ్రహం తెప్పించింది. ఎక్కడో గెలిచి ఇక్కడ పెత్తనం తగదని హెచ్చరించింది. వీరి రచ్చ వైసీపీ పెద్దలకు చికాకు తెప్పిస్తోందట.
అందుకే ఎవరి సరిహద్దులో వారు పనిచేసుకోవాలని ఇద్దరినీ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. అయినా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. అధికార పక్షంలోని నాయకుల అవినీతి మరకలతో, ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్టయింది. అధికార వైసీపీ నేతలే అక్రమ వసూళ్ల విషయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, కోర్టులకు, మీడియాకు ఎక్కడంతో జిల్లాలో వైసీపీ ప్రతిష్ఠ మసకబారుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీకి వైసీపీ నేతలే శత్రువులుగా మారే ప్రమాదం ఉంది.