(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి, అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయనగరం మహారాజా డిగ్రీ కళాశాలపై రాజకీయ రంగు పడింది. మాన్సాస్ పరిధిలో ఉన్న ఈ కళాశాల వ్యవహారం ఇంతవరకు ఆ సంస్థకు చెందిన మాజీ, తాజా అధ్యక్షులు , బాబాయ్ , అమ్మాయి అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు, పూసపాటి సంచైత గజపతి రాజు మధ్య నలుగుతుండేది. అదిప్పుడు టీడీపీ – వైసీపీకి మధ్య ప్రత్యక్ష పోరుకు వేదికగా మారింది.
తాడోపేడోకు సిద్ధమైన టీడీపీ
విజయనగరం మహారాజా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది ఇంటర్ విభాగాన్ని ఎత్తివేయడం, డిగ్రీ విద్యను ఎయిడెడ్ నుండి తప్పించే ప్రయత్నం ముమ్మరం చేయడం, 2020- 21 విద్యా సంవత్సరాన్ని ‘జీరో అకడమిక్ ఇయర్’ గా ప్రకటించి ప్రవేశాలు నిలిపివేయడంతో తెలుగుదేశం పార్టీ ‘సేవ్ మాన్సాస్ – సేవ్ ఎడ్యుకేషన్’ పేరిట ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగా విపక్ష రాజకీయ పార్టీలతో రౌండు టేబుల్ సమావేశం, విద్యార్థులతో సంతకాల సేకరణ, జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. జిల్లా టీడీపీకి పెద్ద దిక్కైన అశోక్ గజపతి రాజును టార్గెట్ చేస్తూ మాన్సాస్ ప్రస్తుత ఛైర్మన్ సంచైత గజపతిరాజు విమర్శలు ఎక్కుపెడుతుండటం, మాన్సాస్‌లో గతంలో జరిగిన వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ పాత్రను ప్రశ్నిస్తుండటంతో టీడీపీ రోడ్డెక్కింది. విజయనగరం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు కిమిడి నాగార్జున, గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఈ వ్యవహారంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న వైసీపీ
మాన్సాస్ వ్యవహారం పూసపాటి రాజుల కుటుంబ వ్యవహారంగా ఇంతవరకు కొట్టిపారేసిన వైసీపీ ఇప్పుడు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను తురుపు ముక్కగా ప్రయోగించింది. ఈ సందర్భంగా విజయనగరంలో ఆ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా బెల్లాన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టిడిపి రాజకీయ నాయకుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉందన్నారు. మాన్సాస్ వ్యవహారాన్ని టిడిపి నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఆస్తులను కాపాడుకోవడానికి, అమరావతి భూములను దోచుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. 2016 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాన్సాస్ పరిధిలో ఉన్న కాలేజ్‌ను ఎయిడెడ్ నుంచి అన్ ఎయిడెడ్‌గా ప్రతిపాదనలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బిఈడి కాలేజ్‌ను మూసివేయడం వాస్తవం కాదా అన్నారు. తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం విద్యార్థులను బలి చేసే కార్యక్రమం చేపట్టడం సరికాదన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని అన్నారు. మాన్సాస్ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందంటూ 170 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మిన వ్యవహారంలో ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పాలన్నారు. అలాగే మాన్సాస్ ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లు ఇచ్చారని , ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో, ఏమయ్యాయో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద విద్యార్థుల మూడేళ్ల డిగ్రీ కోసం పదిహేను వందల రూపాయలు వివిధ ఫీజుల కింద ఖర్చయితే, పేద విద్యార్థుల దగ్గర నుంచి 40 నుండి 50 వేల రూపాయల వరకు ఫీజులు ఎలా వసూలు చేశారని ప్రశ్నించారు. విద్యాసంస్థ పై ఆధారపడుతున్న పేద విద్యార్థులకు, సిబ్బందికి న్యాయం చేయాలన్నారు. గతంలో మాన్సాస్‌కి చెందిన వేల ఎకరాల భూములను తమ అనుయాయులకు 500 రూపాయలకు అప్పజెప్పిన వైనం నిజం కాదా అని ప్రశ్నించారు. మాన్సాస్ సంస్థలో జరుగుతున్న వ్యవహారంపై సంస్థ చైర్మన్ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మరింత అగ్గి రాజేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై అధికార, ప్రతిపక్ష శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా తయారైంది. ప్రతిష్టాత్మకమైన ఒక విద్యా సంస్థపై రాజకీయ రంగు పడి తన ఉనికిని కోల్పోతుండటాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో పరిస్థితి ఎలావుంటుందో వేచి చూడాలి.