ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో.. ఎప్పడు ఎలాంటి అవకాశం లభిస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతకుముందు కంటే బిగ్ బాస్ సీజన్-4తో ఒక్కసారి కోట్లాది మంది ప్రేక్షకులకు పరిచయమైన దివికి ఇప్పుడు అద్బుతమైన అవకాశం లభించింది. మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ఆమె తెలుగు సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో తనకు లభించిన పాత్రల నిడివి చూసుకోకుండా నటించుకుంటూ వెళుతోంది. మహేష్ బాబు హీరోగా నటించిన “మహర్షి” చిత్రంలో కూడా ఆమె ఓ పాత్రలో సందడి చేసింది. తెలుగులో అవకాశాలు పెంచుకుని తన కెరీర్ ను మలుపు తిప్పుకోవాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఊహించని రీతిలో మెగాస్టార్ చిత్రంలో నటించే అవకాశం లభించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
తమిళంలో భారీ విజయం సాధించిన “వేదాళం” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. చిరంజీవి హీరోగా నటించబోయే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య” చిత్రం షూటింగులో బిజీగా ఉన్న చిరంజీవి ఆ చిత్రం పూర్తి కాగానే “వేదాళం” రీమేక్ లో నటిస్తారు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ సీజన్-4కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి విజేతలకు బహుమతులు అందజేస్తూ పోటీదారులందరినీ పలకరించారు. నటి దివి కూడా బిగ్ బాస్ పోటీలో పాల్గొని, మధ్యలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఫైనల్ ఫంక్షన్ లో తాను నటించబోయే “వేదాళం ” చిత్రం తెలుగు రీమేక్ లో దివికి అవకాశం ఇస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంపై దర్శకుడు మెహర్ రమేష్ తో మాట్లాడానని బహుశా పోలీస్ పాత్రను దివికి ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పానని మెగాస్టార్ చెప్పడంతో దివి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎప్పట్నుంచో తాను దేనికోసం ఎదురుచూస్తూ వచ్చానో అది బిగ్ బాస్ వేదికే తనకు వచ్చేలా చేసిందని దివి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
Must Read ;- బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే హైలైట్స్