డీజే టిల్లు.. పేరు వినగానే వెరైటీగా ఉంది కదూ. సిద్ధు జొన్నల గడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ మధ్య యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో సిద్ధు ఒకరు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. బాలగంగాధర్ తిలక్ అనే పేరును డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)గా మార్చుకుని డీజేగా చలామని అవుతుంటాడతను. కేవలం బిల్డప్ తో బతుకు సాగించే బాపతు. అతని జీవితంలో ఓ రాధిక (నేహాశెట్టి) ప్రవేశిస్తుంది. ఈరోజుల్లో బ్రేకప్ లు షరామామూలే కాబట్టి ఈమె కూడా అలాంటి బాపతే. తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ (కిరీటి) నుంచి విడిపోయే సమయంలో ఈ డీజీ టిల్లు పరిచయమవుతాడు.
కొత్త పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. పాత బ్రేకప్ సంగతి బయటపడగానే ఇద్దరి మధ్యా మళ్లీ గొడవ. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ చనిపోతాడు. ఇద్దరి మెడకూ ఈ కేసు చుట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరు అందులో నుంచి ఎలా బయటపడ్డారు? లాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
యూత్ లవ్ స్టోరీలో మంచి వినోదం తోడైతే ఎలా ఉంటుందో అలానే ఈ సినిమా ఉంది. ఈ వినోదాన్ని పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథకు పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినా కథనంలో నైపుణ్యం చూపి కాస్త నవ్వించగలిగితే ఏ సినిమా అయినా హిట్టే. ఆ మధ్య జాతిరత్నాలు విషయంలోనూ ఇది రుజువైంది. అదే బాటలోనే సాగిన సినిమా అని చెప్పవచ్చు. యువతలో ఉండే పిచ్చి అల్లరిని ఆకర్షణీయంగా తెరకెక్కించగలిగారు. చక్కటి యాసతో యువతకు కిక్ ఇచ్చేలా ఈ సినిమా ఉంది.
టిపికల్ హైదరాబాదీ అర్బన్ యూత్ యాసతో సాగే టిల్లు డైలాగులకు జనం విరగబడి నవ్వారు. సిద్ధు నటన గురించి చెప్పాల్సి వస్తే కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నాడు. యూత్ కు దగ్గర కాగలిగితే సగం సక్సెస్ అయినట్టే. ఇందులో అతను పోషించిన పాత్ర అతన్ని యూత్ కు మరింత దగ్గర చేసింది. పైగా అతనిలోనే రచయిత కూడా ఉన్నాడు కాబట్టి ఈ రెండు పాత్రలకూ న్యాయం చేశాడు. నేహాశర్మ కూడా మెప్పించింది. ఈ మధ్య బ్రహ్మాజీ పోషించే పాత్రల్లో మంచి టైమింగ్ కనిపిస్తోంది.
సినిమా ఫస్ట్ హాఫ్ లో ఓ ఊపు ఊపేశాడు. ద్వితీయార్థంలో కొంత వేగం తగ్గినా కథని దర్శకుడు రక్తి కట్టించేశాడు. టెంపో కొనసాగించడంతో దర్శకుడు కొంత విఫలమయ్యాడు. లాజిక్ లేకుండా కథ నడిపేసరికి గాడి తప్పినట్టయ్యింది. సిద్దు నటన, డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పాలి. సంగీతం పరంగానూ సినిమా ఓకే. శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల మంచి ట్యూన్స్ ఇవ్వడంతోపాటు, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి , ప్రిన్స్, నర్రా శీను, బ్రహ్మాజీ, ప్రగతి, కిరీటి, ఫిష్ వెంకట్ తదితరులు.
సాంకేతిక వర్గం: శ్రీచరణ్ పాకాల – రామ్ మిరియాల, నేపథ్య సంగీతం: తమన్, కెమెరా: సాయి ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
నిర్మాణం: సితార ఎంటర్ టైన్ మెంట్స్
కథ-స్క్రీన్ ప్లే: విమల్ కృష్ణ-సిద్ధు జొన్నలగడ్డ
మాటలు: సిద్ధు జొన్నల గడ్డ
దర్శకత్వం: విమల్ కృష్ణ
విడుదల తేదీ: 12-02-2022
ఒక్క మాటలో: యూత్ గుండె జల్లు
రేటింగ్: 3/5