చిత్ర పరిశ్రమలో ‘డూ ఇట్ టీమ్’ అంటూ ఏదైనా ఉందా? మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఈ టీమ్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది? ఇవే ఇప్పడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు. చిత్ర పరిశ్రమలోని ఎంతో మంది ఇప్పుడు ఈ టీమ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నార. ఈ టీమ్ చేస్తున్న ప్రయత్నానికి చిరంజీవి ఓ ఆడియో సందేశం పంపి మద్దతు తెలిపారు. ఇలా ఆడియో సందేశం పంపటం తమకు ఓ పెద్ద బహుమానం అంటూ ఈ టీమ్ పేర్కొంది. అసలు ఈ టీమ్ గురించి వారు చెప్పారో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రయత్నానికి చేదోడువాదోడుగా ఉండేందుకు కొందరు ఐటీ వ్యక్తులు ఈ టీమ్ ను ప్రారంభించారట. ఆ సంస్థ ఇప్పుడు కోవిడ్ బాధితులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందట. ఆక్సిజన్ అందుబాటులో లేని వారికి ఆక్సిజన్ అందజేయటం, ఆస్పత్రుల్లో బెడ్స్ ఏర్పాటుచేయటం, మందులు దొరకని వారికి మందులు అందేలా చూడటం, మంచి నిపుణులైన వైద్యులతో ఆన్ లైన్ కన్సల్టేషన్ ద్వారా సూచనలు సలహాలు ఇవ్వడమేకాక మందులు కూడా పంపిణీ చేస్తోందట.
చిత్ర పరిశ్రమలోని వారు మాత్రం ఈ సంస్థ గురించి ఇప్పుడే వింటున్నామని అంటున్నారు. ఇప్పటిదాకా డ్యాన్సర్లకు శేఖర్ మాస్టర్ నిత్యావసరాలు అందజేయడం, కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని మనం సైతం టీమ్ చురుకుగా తమవంతు సహాయక చర్యలు చేపట్టాయి. కోవిడ్ పేషెంట్లకు ఊచితంగా భోజన సదుపాయం, మందుల కిట్, పీపీఈ కిట్, మాస్క్, శానిటైజర్, ఇమ్యూనిటీ పొడి, ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటిని మనం సైతం అందించింది. అలాగే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో తమ వంతు సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
హిందూపురం ప్రజలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వంతు సహాయంగా కరోనా కేర్ కిట్లను పంపించారు. అలాగే నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మొదట్నుంచీ ఇలాంటి విషయంలో ముందుంటున్నారు. ఆయన ఎక్కడా రాజీపడకుండా సినీ కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అన్ని శాఖలకూ సంబంధించి 25 బెడ్ ఆస్పత్రి ఏర్పాటు చేసుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయంలో చదలవాడ శ్రీనివాసరావు మాత్రమే సినీ కార్మికులకు అండగా నిలిచారు.
కనీసం సినిమా హీరోలకైనా ఇప్పటిదాకా ఇలాంటి ఆలోచన రాకపోవడం శోచనీయం. ఒకే ఒక్క ఆస్పత్రిని నిర్మించుకుని ఉంటే వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేది. 500 కోట్ల సినిమా చేయగలం కానీ ఒక్క కోటి రూపాయలతో హాస్పిటల్ ఎందుకు నిర్మించుకోలేకపోతున్నామని సినీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దీనికి మన నిర్మాతలు, దర్శకులు, ముఖ్యంగా హీరోలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
Must Read ;- కోవిడ్ బాధితులకు నటసింహ బాలకృష్ణ భారీ సహాయం