2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే జమిలి ఎన్నికలు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలకు జనసైనికులు సిద్దంగా ఉండాలని, అధికారం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముందస్తు జమిలి ఎన్నికలపై తనకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు జనసైనికులు తయారుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీతో జట్టుకట్టిన జనసేనాని జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేంద్రలోని కొందరు బీజేపీ సీనియర్ నాయకులతో టచ్ లో ఉన్న జనసేనాని ముందస్తు జమిలి ఎన్నికల గురించి బహిరంగంగా ప్రకటించారంటే, పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
2022లో వచ్చే అవకాశం
దేశం మొత్తం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా ఖర్చులు తగ్గడంతోపాటు, ప్రతి సంవత్సరం దేశంలో ఏదో ఒక మూల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని నివారించాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అనేక వేదికలపై ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు అనే దానిపై మాత్రం ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచింది వారు ప్రచారంలోకి తెస్తున్నారు.. తాజాగా జనసేనాని పవన కళ్యాణ్ కూడా జమిలి ఎన్నికలు వస్తాయని మాత్రమే చెప్పారు. కానీ ఎప్పుడు జరుగుతాయనే విషయంలో స్పష్టత లేదు. పవన్ కూడా ఏదో గాలివాటుగా.. ముందే ఎన్నికలు వచ్చేస్తాయి అని పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపడానికి ఓ రాయి విసిరారా.. లేదా నిజంగానే ఆయనకు అలాంటి సమాచారం ఉందా అనేది తెలియడం లేదు.
సాధారణంగా 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాలి. దానికి రెండు సంవత్సరాల ముందు అంటే 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అనేక పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు పూర్తయి కేవలం 18 నెలలు మాత్రమే అవుతోంది. మరలా ఇప్పుడే ఎన్నికలు అంటే జనంలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే 2024 జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలకంటే 2 సంవత్సరాలు లేదా ఒకటిన్నర సంవత్సరం ముందు జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చు అనేది ఒక అంచనా.
Must Read ;- జమిలి ఎన్నికలకు గంట మోగుతోందా?
జమిలి ఎన్నికలతో ప్రయోజనం ఎంత?
దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించినా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు నడుస్తాయన్న గ్యారంటీ లేదు. సంపూర్ణ మెజారిటీ వచ్చిన రాష్ట్రాల్లో పాలన ఐదేళ్లు సాగుతుందనుకున్నా, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కూటములు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాల్లో ఐదేళ్లు సక్రమంగా అధికారంలో ఉంటారన్న నమ్మకం లేదు. ఒకవేళ సంవత్సరానికే ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిణామాలన్నింటికీ ముందే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అది లేకపోతే జమిలి ఎన్నికలు పెట్టి ఏం ప్రయోజనం. ఎలాగూ పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు వస్తాయి. ఇక రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సారి పూర్తవుతుంది. అప్పుడే ఎన్నికలు నిర్వహించుకోవడం మేలనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
రాజకీయ కోణం
జమిలి ఎన్నికలు నిర్వహించడలో బీజేపీ రాజకీయ ప్రయోజనం కోణంలో ఆలోచిస్తోందా? అనే విషయంపై కూడా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అసెంబ్లీ , పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు తమ ఓట్ల ద్వారా స్పష్టమైన అభిప్రాయం చెప్పగలుగుతున్నారు. కేంద్ర పాలనపై సంతృప్తి, అసంతృప్తిని తెలియపరిచేందుకు ఒక ఓటు వేసేప్పుడు ఆలోచించుకోవాలి. అదే సమయంలో అసెంబ్లీ ఓటు వేసేప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీకి వేయాలని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని బీజేపీ భావిస్తోంది.
ఒకే సారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే పార్లమెంటు స్థానాలతో పాటు, సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో కాషాయ జెండాను రెపరెపలాడించవచ్చనేది వారి ఆశ! నిజానికి జమిలి ఎన్నికలతో దేశమంతా కలిపి చూసినప్పుడు కాస్త ఖర్చు తగ్గడం మినహా, జనానికి పెద్దగా ఒరిగేది ఉండదు.
Also Read ;- పవన్ కళ్యాణ్ అంటే బీజేపీకి అంత లోకువా!