జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసాయి. ఎన్నికలు ముగిసాక ఫలితాలపై జనం ఇంట్రస్ట్ చూపిస్తారు. ఏ పార్టీ గెలవబోతుంది? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతాయి? అనే చర్చ సాధారణంగా ఉంటుంది. అయితే 4వ తేదీన వెలువడే ఫలితాలపై ఆసక్తి చూపించకుండా ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతంపై జనం చర్చించుకుంటున్నారు. ఎంత పోలింగ్ నమోదైంది? ఇంత తక్కువ ఎందుకు నమోదైంది? అసలు ఫైనల్ పోలింగ్ ఎంత? అనే చర్చ అందరిలో కనబడుతోంది.
నిన్న సాయంత్రం 4 గంటల వరకు 30 శాతంగా ఉన్న పోలింగ్.. మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు పొలింగ్ స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు డిసెంబర్ 1న ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి పోలింగ్ మందకోడిగానే సాగింది. అయితే సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ పెరిగి మొత్తంగా 46.6 శాతంగా నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పోలింగ్ శాతం గతంలో నమోదైన పోలింగ్ శాతం కంటే 1.31 శాతం ఎక్కువగానే నమోదవ్వడం విశేషం. నిన్న అర్ధరాత్రి వరకు 45.97 శాతం పోలింగ్ జరిగిందని, ఈ రోజు ఉదయం వెళ్లడించిన వివరాల ప్రకారంగా 46.6 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది.
రికార్డ్ బ్రేక్…
2009, 2016 ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో జరిగాయి. 2009 జరిగిన ఎన్నికల్లో 42.04 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 45.29 శాతంగా నమోదైంది. 2002లో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో 43.27శాతం పోలింగ్ నమోదైంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 50.86 శాతం, 2018లో 53 శాతంగా పోలింగ్ నమోదైంది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో 46.6 శాతంగా నమోదై గతంలో గ్రేటర్ లోని రికార్డును బ్రేక్ చేస్తూ నమోదైంది. డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
పెరిగిందా?…
నిన్న 4 గంటల వరకు 30 శాతం కూడా దాటని పోలింగ్ రెండు గంటల్లో ఒకే సారి పోలింగ్ ఇంత ఎలా పెరిగిందనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. పోలింగ్ సమయం నిన్న సాయంత్రం 6 గంట వరకు మాత్రమే. అయితే ఎవరైతే 6 గంటల లోపు క్యూలైన్లో ఓటు వేసేందుకు నిలబడి ఉంటారో వారికి ఓటు వేసే అవకాశాన్ని ఆ తరువాత కూడా కల్పిస్తారు. ఈ రకంగా పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగి ఉంటుందని తెలుస్తోంది.