(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా ప్రారంభించిన డోర్ టు డోర్ ఫీవర్ సర్వే విశాఖ నగరంలో మొక్కుబడిగా సాగుతోంది.ఇప్పటికే రెండు దశలు పూర్తయిన అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఎవరు ఈ సర్వేలో పాల్గొనలేదు.ప్రధానంగా జీవీఎంసీ పరిధిలోని కీలక ప్రాంతాల్లోనే ఇప్పటివరకు సిబ్బంది సర్వే చేపట్టలేదు. ఈనెల 15 నుంచి ప్రారంభమైన ఫస్ట్ రౌండ్‌లో గాని,సెకండ్ రౌండ్‌లో గాని సచివాలయం సిబ్బంది ఈ ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన దాఖలాలు లేవు.కూర్మన్నపాలెం ప్రాంతంలో,గోపాలపట్నం,ఎన్ఏడి కొత్త రోడ్,వేపగుంట ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.ఉన్నతాధికారులు సర్వే జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారని సమాచారం ఉన్న ప్రాంతాల్లో మాత్రం సిబ్బంది చురుకుగా సర్వే చేస్తున్నారు.ఇంటింటి సర్వేకు అనేక ప్రాంతాల్లో సిబ్బంది రావడం గానీ,కనీసం ఫోన్లో సంప్రదించడం గానీ జరగలేదు.ఈ విషయమై ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? అని ప్రశ్నిస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో సర్వేలు ఆరు దశల్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు తొలి దశ, 18 నుంచి 20 వరకు రెండో దశ, ఇలా వచ్చే నెల ఒకటో తేదీ వరకు ప్రతి వార్డు సచివాలయం పరిధిలోని సిబ్బంది ఆరుసార్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంది.ముఖ్యంగా ఆశా వర్కర్లు,ఎఎన్ఎంలు, వాలంటీర్లు ఈ సర్వే చేయాల్సి ఉంది.
వైరస్ లక్షణాలు ఉంటే ఇంటి వద్దె పరీక్ష..
ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే మెడికల్ ఆఫీసర్‌కు సర్వే చేసిన సిబ్బంది సమాచారం ఇస్తారు. రోగ లక్షణాలను బట్టి నిర్ధారణ పరీక్ష చేసేందుకు రాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రికి రెఫర్ చేస్తారు.ఈ ప్రక్రియ అంతా జరగాలంటే ముందుగా ఇంటింటి సర్వే జరగాల్సి ఉంది.ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.అధికారులు ప్రకటనలు తప్ప,వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించే తీరిక లేకుండా పోయింది.ఈ ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన ఐదు మండలాల సిబ్బంది వేతనాలను నిలిపివేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ harinarayanan తీసుకున్న నిర్ణయం సంచలనం అనే చెప్పాలి.ప్రజల ఆరోగ్య, ప్రాణాలకు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పట్ల కఠిన వైఖరి అవలంబిస్తే గాని ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదు.మిగిలిన నాలుగు దశల సర్వే అయినా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.జీవీఎంసీ పరిధిలో కమిషనర్ సృజన పలు వార్డుల్లో పర్యటన చేస్తూ ఫీవర్ సర్వేపై ఆరా తీస్తున్నారు. ఆమె పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే సిబ్బంది అప్రమత్తమై సర్వే చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సర్వే పక్కాగా సాగడం లేదు.
Must Read ;- కరోనా కోరల్లో ఉన్నతాధికారులు.. విశాఖ కలెక్టర్,జీవీఎంసీ కమిషనర్‌కు పాజిటివ్