కరోనా టీకాల కొనుగోలులో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది.ప్రస్తుతం నెలకు కేవలం19 లక్షల టీకాలు మాత్రమే వస్తున్నాయని, అవి కేవలం మొదటి డోసు ఇచ్చిన వారికి, రెండో డోసు కోసమే సరిపోతున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు.దేశంలో కరోనా టీకాలు కొనుగోలు చేయాలన్నా దొరకడం లేదని ఆయన గుర్తు చేశారు. అందుకే కరోనా టీకాలు ఏ దేశంలో అందుబాటులో ఉన్నా గ్లోబల్ టెండర్లు పిలిచి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఇందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి.విదేశాల్లో విడుదల చేసిన టీకాలను మన దేశంలోనూ డీజీసీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి కేంద్రం అనుమతించింది.ఇలా నాలుగైదు కంపెనీల టీకాలు దేశంలోనే తయారు చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ల కొరతను అదిగమించాలని కేంద్రం భావిస్తోంది.
సాధ్యమవుతుందా?
గ్లోబల్ టెండర్లు పిలవడం ద్వారా కరోనా టీకాలు కొనుగోలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం పలు టీకాలకు అనుమతులు ఇచ్చేందుకు దేశీయంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. ఇవి త్వరలో అనుమతులు పొంది, ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోగా కరోనా టీకాను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా టీకాలకు ఎంతఖర్ఛయినా భరించేందుకు సిద్దంగా ఉందని, అయితే దేశంలో కరోనా టీకాలు నెలకు 19 లక్షలు మించి అందకపోవడం, విదేశాల నుంచి కొనుగోలు చేయాలన్నా కేంద్రం అనుమతి లభించడం లేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.ఒక వేళ కేంద్రం అనుమతిస్తే టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేవలం 12 లక్షలే ఎందుకు..
మన దేశంలో రెండు కంపెనీలు నెలకు7 కోట్ల డోసుల టీకాలు తయారు చేస్తున్నాయి.అందులో సగం కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. మిగిలిన 3.5 కోట్ల డోసులు ముందుగా ఎవరు అడ్వాన్స్ చెల్లించి ఆర్డర్లు పెడితే ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. గత నెలలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.45 కోట్లు విడుదల చేసి 12 లక్షల టీకాలకే ఆర్డర్లు పెట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టి ఉంటే ఇప్పటికే ఆయా కంపెనీలు టీకాలు అందించి ఉండేవని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.మహారాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల టీకాలకు ఆర్డర్లు పెట్టిందని వారు గుర్తు చేస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్రలో 2.2 కోట్ల మందికి టీకాలు కూడా వేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం టీకాలు కొనుగోలు చేసే ఉద్దేశం లేకనే కేవలం12 లక్షల టీకాలకు ఆర్డరు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్లోబల్ టెండర్లు ఎప్పుడు పిలుస్తారు?
టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అయితే సాధ్యాసాధ్యాలు పరిశీలించే విషయాన్ని అధికారులకు వదిలేశారు.విదేశాల్లో టీకాలు దొరికితే కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని, కానీ మరో రెండు నెలల వరకు ఎక్కడా టీకాలు దొరికే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆర్డరు పెట్టినా టీకాలు రావడానికి రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు.ఈ లోగా కేంద్రం సరఫరా చేసే టీకాలు వేయడం తప్ప చేయగలిగింది కనిపించడం లేదు. కేంద్రం ఏపీకి నెలకు 19 లక్షల టీకాలు సరఫరా చేస్తోంది. ఇలాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగితే 9.5 కోట్ల డోసులు వేసేందుకు 38 నెలల కాలం పట్టవచ్చని అంచనా. ఇదే జరిగితే కరోనా మూడో వేవ్ కూడా తీవ్రంగా పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.