Drishyam 2 Movie Review
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ‘దృశ్యం 2’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా నేరుగా విడుదలైంది. ఇంతకుముందు వచ్చిన దృశ్యం చిత్రానికి ఇది కొనసాగింపు. మలయాళ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కింది. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ దీనికి కూడా దర్శకత్వం వహించారు. మొదటి పార్ట్ మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందన్నది చూద్దాం.
కథలోకి వెళితే..
వరుణ్ హత్య కేసు నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్ రాంబాబు ఎలా బయటపడ్డాడు అన్నదే దృశ్యం మొదటి పార్ట్ కథ. దానికి కొనసాగింపు అన్నప్పుడు మళ్లీ ఆ కేసును తిరగదోడితే ఎలాంటి ఫలితం వచ్చింది? దీన్నుంచి మళ్లీ రాంబాబు ఎలా బయటపడ్డాడు అన్నది ఈ కొనసాగింపులో ఉంది. కేబుల్ టీవీ ఆపరేటర్ రాంబాబు(వెంకటేష్) ఇందులో థియేటర్ ఓనర్ కూడా మారాడు. నిర్మాతగా మారి సినిమా తీసే ప్రయత్నాల్లో ఉంటాడు. సాఫీగా సాగుతున్న అతని జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీత (నదియా), ప్రభాకర్ ( వీకే నరేష్) ప్రవేశిస్తారు.
కేసును రీఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అందుకు ఐజీ గౌతమ్ (సంపత్ రాజ్) ఎలాంటి ఏర్పాట్లు చేశాడు అన్నదే ప్రధాన కథ. వరుణ్ డెడ్ బాడీని రాంబాబు పోలీస్ స్టేషన్ లో పూడ్చిపెట్టినట్టు ఎలా బయటపడింది? దీని కోసం పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాంబాబు అరెస్ట్ అయ్యాడా? అతను సినిమా తీశాడా? లేదా? ఈ కేసు నుంచి అతను, అతని కుటుంబం ఎలా బయటపడ్డారు? లాంటి ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది.
Drishyam 2 Movie Review
ఎలా తీశారు? ఎలా చేశారు?
లాజిక్ గురించి ఆలోచించకుండా ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఆ థ్రిల్ ఉంటుంది. పోలీసుల దర్యాప్తులో ఎప్పుడో ఆరేళ్ల క్రితం రాంబాబు అక్కడికి వచ్చాడా లేదా తెలుసుకునేందుకు పక్కింటి వారితో మాట్లాడటం, వారు చెప్పే సమాధానం కృతకంగా అనిపిస్తుంది. తెలుగు నేటివిటీ కోసం సినిమా ప్రథమార్థంలో దర్శకుడు స్వల్ప మార్పులు చేశాడు. వరుణ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే విషయం కోసం మరో ఉపకథను చొప్పించడం కోసం జనార్దన్ (షఫీ) అనే కొత్త పాత్రను తెచ్చారు. ఆ పాత్ర తాలూకు నిడివి కాస్త పెరిగింది. అలాగే రాంబాబు పెద్ద కూతురు మానసిక సమస్యతో బాధ పడటం లాంటి అంశాలు ప్రథమార్థం సాగదీతలా అనిపిస్తుంది.
వరుణ్ డెడ్ బాడీ బయటపడగానే కథ వేగం అందుకుంది. రాంబాబుగా వెంకటేష్ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఆ పాత్ర తాలూకు మానసిక సంఘర్షణను, భావోద్వేగాలను చక్కగా పండించగలిగారు. ఐజీ గౌతమ్ గా సంపత్ రాజ్, వరుణ్ తల్లిదండ్రుల పాత్రల్లో నదియా, నరేష్ ఒదిగిపోయారు. అనూప్ రూబెన్స్ బ్యాగ్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథలో లాజిక్ అందని అంశాలు ఉన్నా వాటి జోలికి పోకుండా సినిమాని ఎంజాయ్ చేస్తే చాలు. కోర్టు సన్నివేశాలు బాగా పండాయి. ఇక ఈ కథకు కొనసాగింపు ఉండదన్నట్లుగానే దర్శకుడు ముగింపు ఇచ్చారు. కాబట్టి దీనికి మరో కొనసాగింపు ఉండే అవకాశం కూడా లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న సినిమాగా చెప్పవచ్చు.
నటీనటులు: వెంకటేష్, మీనా, సంపత్ రాజ్, వీకే నరేష్, నదియా, కృతికా, ఈస్టర్ అనిల్, పూర్ణ, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర, టిల్లు వేణు తదితరులు
సాంకేతిక వర్గం: సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సతీష్ కురుప్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణం: సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్
నిర్మాతలు: డి. సురేష్ బాబు, ఆంథోని పెరంబపూర్, రాజ్ కుమార్ సేతుపతి
దర్శకత్వం: జీతు జోసెఫ్
విడుదల: అమెజాన్ ఓటీటీ
విడుదల తేదీ: 25-11-21
ఒక్క మాటలో: అదే దృశ్యం
రేటింగ్: 3/5