గత మూడేళ్ళ క్రితం టాలీవుడ్ కావచ్చు..
మొన్నటి శాండల్ వుడ్ కావచ్చు..
నిన్నటి బాలీవుడ్ కావచ్చు!
సినిమా తారలు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే ఆరోపణలు, విచారణలు షరామామూలే అవుతున్నాయి. నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఎంతో డబ్బు – మరెంతో పాపులారిటీ ఉన్న కొందరు సినీ ప్రముఖులు ఎందుకు మత్తు కి బానిసలు అవుతున్నారు? తెర వెనుక ఏం జరుగుతోంది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ప్రపంచ వ్యాప్తంగా సినిమా కళకి పుట్టిల్లు అయినా, అమ్మమ్మ అయినా హాలీవుడ్ ఒక్కటే. అక్కడ ఈ మత్తు కథలు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం.
హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసేది నిర్మాతలేనా?
సినిమా మేకింగ్ కే కాదు.. స్టార్స్ మత్తు మందుల వాడకానికి కూడా హాలీవుడ్ పుట్టిల్లు.1920-1960 మధ్య కాలం హాలీవుడ్ కి స్వర్ణయుగం. క్లాసిక్ హాలీవుడ్ టైమ్ అంటారు. విరివిగా సినిమా షూటింగ్స్ జరుగుతుండేవి. పని గంటలు ఎక్కువ. వచ్చిన పేరు ఎక్కడ పోతుందోననే భయం. మారిపోయే రూపు రేఖల భయం.. అవకాశాలు మరొకరు తన్నుకు పోతారేమో అనే భయం.. చేస్తున్న సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలి అనే తాపత్రయం.. ఇన్ని ఎమోషన్స్ ను తట్టుకుని సినిమా రంగంలో నిలబడాలి.
తారల భయాలు, బలహీనతలను పోగొట్టేందుకు అప్పటి నిర్మాతలు, ప్రముఖ స్టూడియోలు హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేయడం మొదలు పెట్టాయి. ప్రతి స్టూడియోకి డాక్టర్ ఉండేవాడు. షూటింగ్ లో అలసిపోయిన హీరోయిన్స్ కి మొదట స్లీపింగ్ పిల్స్ ఇచ్చేవారు. నాలుగు గంటల నిద్ర తర్వాత లేపి విటమిన్ షాట్స్ అంటూ డ్రగ్స్ ఇచ్చేవారు. ప్రముఖ స్టూడియో ఎంజీఎం స్టూడియోస్ అప్పట్లోచాలా మంది హీరోయిన్స్ కి ఇలాగే డ్రగ్స్ అలవాటు చేసిందనే ఆరోపణలున్నాయి. ఆ మత్తులో స్టార్స్ తో 72 గంటల పాటు నిరవధికంగా పని చేయిస్తుండే వారు. ఆలా మత్తుకి బానిసలై జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న కొందరు తారల కథలు తెలుసుకుందాం.
జూడీ గార్లాండ్ విషయంలో ఏంజరిగింది?
జూడీ గార్లాండ్ హాలీవుడ్ తొలిదశపు సూపర్ హీరోయిన్. అతి చిన్న వయసులో.. అంటే13 ఏళ్ళ వయసులో ఎంజీఎం స్టూడియోస్ తో కాంట్రాక్టు సంతకం చేసింది. ఆ వయసు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలకు పనికి రాదు, హీరోయిన్ పాత్ర చేయించలేరు. మరో వైపు స్టూడియో ఎగ్జిక్యూటివ్స్ జోడీ గార్లాండ్ శరీరం మీద రకరకాల కామెంట్స్. ఆకర్షణీయంగా లేదని, సెక్సీ గా కనబడటం లేదని కామెంట్స్ చేసే వారట.17 ఏళ్ళ వయసులో ‘ది విజార్డ్ అఫ్ అజ్’ అనే సినిమాతో తొలి విజయాన్ని అందుకుంది . ఆ తరవాత చాలా సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఎక్కువ పనిగంటలు – ఆర్ధిక సమస్యలు , తన ఫిజిక్ మీద కామెంట్స్- అప్పటికే అలవాటు అయిన విటమిన్ షాట్స్ తో డ్రగ్ అడిక్ట్ అయింది జూడీ గార్లాండ్ .
మరో వైపు ప్రేమ వ్యవహారాలు
ఒక దశలో గర్భవతి అయింది జూడీ గార్లాండ్. స్టూడియో యాజమాన్యం ప్రెగెన్సీ తొలగించుకోమని వత్తిడి తెచ్చింది. ఆ తర్వాత ఏడాదే జూడీ గార్లాండ్ నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురైంది. దాంతో మణికట్టు దగ్గర కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది జూడీ. ఆ వార్త సంచలనం కావడంతో స్టూడియో -15 ఏళ్ళ నుంచి ఉన్న కాంట్రాక్టు రద్దు చేసింది. ఆ తరవాత కూడా జూడీ గార్లాండ్ హీరోయిన్ గా కొన్ని విజయవంతమైన సినిమాలు చేసింది. నిర్మాతలు అలవాటు చేసిన డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది.
చివరికి డ్రగ్స్ ఓవర్ డోస్ అ కెరీర్ బాగున్నప్పటికీ జూడీ తన 49 వ ఏట అకస్మాతుగా చనిపోయింది. హాలీవుడ్ నిర్మాతలే తారలకు డ్రగ్స్ అలవాటు చేయడం సంచలన వార్త అయింది. అయితే ఎంజీఎం సంస్థ ప్రతినిధి మాత్రం జూడీ గార్లాండ్ మత్తు వ్యసనాలకు బానిస కావడం వెనుక తమ నిర్మాణ సంస్థకి ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే జూడీ గార్లాండ్ బయోగ్రఫీ రాసిన పాల్ దున్నెలీ మాత్రం స్టూడియో హాస్పిటల్ గురించి, అక్కడ విటమిన్ షాట్స్ ఇచ్చిన డాక్టర్ గురించి తన పుస్తకంలో రాశాడు. ఇలా మత్తుకు బానిసలు అయిన మరికొందరి తారల అసలు కథలు మరిన్ని మున్ముందు తెలుసుకుందాం.
– ప్రసాద్ తోట