DSC-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు వైసీపీ తీరుపై భగ్గుమన్నారు. మెగా డీఎస్సీపై ఆ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని ఖండిస్తూ 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు విశాఖలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. విక్టరీ ఎట్ సీ నుంచి ఆర్కే బీచ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎంతో కష్టపడి చదివి తాము ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని, తమ విజయాలను రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని వారు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు నిరాధారమైన నిందలు వేస్తూ వేలాది మంది అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కష్టార్జితంతో కొలువులు సాధించిన తమపై బురదజల్లే ప్రయత్నాలను ఆపాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యవహారశైలిపై ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. DSC-2025 నియామకాల ప్రక్రియపై ఆయన చేస్తున్న అసత్య ఆరోపణలు, విషప్రచారాన్ని వెంటనే ఆపాలని హితవు పలికారు. సొంత కష్టంతో ఉద్యోగాలు పొందిన యువతను అవమానించేలా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఇకపై ఏమాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు. డీఎస్సీపై వైసీపీ ఇదే తరహాలో తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తే..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉపాధ్యాయుల ఉసురు తగిలితే స్థానిక పోరులో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు.











