దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అమీతుమీ తేల్చుకున్న ప్రధాన పార్టీలు ఇక ఈనెల 3వ తేదీన జరిగే పోలింగ్ రోజు తమ బలాబలాలను తేల్చుకోనున్నాయి. గత రెండు నెలలుగా దుబ్బాక నియోజకవర్గం ఎన్నికల ప్రచారంతో హెరెత్తింది. తమ అభ్యర్థుల గెలుపుకోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ముఖ్యమైన నేతలందరూ నియోజకవర్గ బాట పట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉప ఎన్నికలో పార్టీలు సీరియస్‌గా తలపడ్డాయి. దుబ్బాక ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిద్ధిపేట జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. పక్కనే ఉన్న సిద్ధిపేట నుంచి మంత్రి హరీష్ రావు, గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దుబ్బాక ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. పైగా అది టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా.
సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడి నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. అలాగే గతంలో పలుమార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పోటీచేసి రఘునందన్‌రావు ఓటమి పాలయ్యారు. అయితే బీజేపీ అభ్యర్థిగా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చైనా దుబ్బాకను అభివృద్ది చేస్తాననే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశించి బంగపడ్డ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి తన అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఇలా త్రిముఖ పోరు నడుమ దుబ్బాక ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా మాత్రం ఎన్నికల పోటీ టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్యే ఉండనుంది.
సానుభూతి మంత్రం..
ఒక పక్క అభివృద్ధి మంత్రం.. మరో పక్క సానుభూతి పర్వం.. ఈరెండు అంశాలపైనే దుబ్బాక ఫలితాలు ఆధారపడనున్నాయి. ఎవరికి పట్టం కడతారో తేల్చనున్నాయి. ప్రజలు.. ఒకవేళ మార్పు కోరుకుంటే కచ్చితంగా బీజేపీవైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే రామలింగారెడ్డి మరణించిన కాన్నుంచి ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉంటున్నారు. పైగా ప్రజల్లో తనపై విపరీతంగా సానుభూతి ఉంది. ఈ ఒక్క సారి ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ధోరణిలోనూ ఓటర్లు ఉన్నారు. మంచి నేత అనే పేరు సైతం రఘునందన్‌రావుకు ఉండడం ప్లస్‌పాయింటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా బీజేపీకి బాగా కలసి వచ్చే అంశం.
హరీష్‌పై నమ్మకం…
ఇక టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సుజాత విషయానికొస్తే భర్త చనిపోవడంతో ఎన్నికల బరిలో నిలవాల్సి వచ్చింది. టిక్కెట్ కోసం తమ కుటుంబ తగాదాలు, రామలింగారెడ్డి కుమారుడుపైన సోషల్ మీడియాలో వచ్చిన పలు ఆరోపణలు, వారి కుటుంబంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవన్నీ ప్రతికూల అంశాలుగా చూడాల్సి ఉంది. కేవలం ఈమె గెలుపు హరీష్ రావుపైనే ఆధారపడి ఉంది. ఓటెస్తే గానీ కేవలం హరీష్ పైన నమ్మకంతోనే జనాలు ఓటేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లుగా దుబ్బాకను కూడా అభివృద్ధి చేస్తారని నమ్మే వాళ్లు ఉన్నారు. అందుకే గులాబీ బాస్ ఆ బాధ్యతను హరీష్‌కే అప్పగించారు. తాను ఒక్కడై దుబ్బాకలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవేళ దుబ్బాకలో సుజాత గెలుస్తే అది హరీష్ గెలుపుగానే చూడాల్సి ఉంటుంది.
మంత్రి హరీష్ రావు అన్నట్లుగా.. దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి లక్ష మెజార్టీ రాకపోవచ్చు. మెజార్టీ వచ్చినా కాని అది స్వల్ప మెజార్టీగానే ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం గతంలో కంటే భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. గెలుపు మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉండబోతుంది. ఒక వేళ బీజేపీ గెలిచినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. పోలింగ్ ఈనెల 3వ తేదీన జరగనుంది. అయితే ఈలోపు సీన్ అటు ఇటుగా మారే అవకాశలు కూడా ఉన్నాయి. కచ్చితంగా ఎవరు గెలవబోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం ఈనెల 10వ తేదీ వరకు ఆగాల్సిందే.