దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైపోయింది. ఇందులో భాగంగా అందరికీ అమితాసక్తి రేకెత్తించిన తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ప్రారంభం కాకముందే రెండు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. దీంతో తొలి గంటలోనే రెండు నియోజకవర్గాల్లో 7 శాతానికి మించి పోలింగ్ నమోదు అయ్యింది. తొలి గంట పోలింగ్ ప్రశాంతంగానే సాగినా.. ఆ వెంటనే పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇటు హుజూరాబాద్‌తో పాటు అటు బద్వేల్‌లోనూ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్థానిక పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా వెనువెంటనే రంగంలోకి దిగిపోయి.. ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలను నిలువరించే యత్నం చేశాయి.
కౌశిక్ రెడ్డి అడ్డగింత
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగానూ ఆసక్తి రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇటు టీఆర్ఎస్‌తో పాటు అటు బీజేపీ శ్రేణులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఇరు పార్టీల మధ్య తోపులాటలతో పాటు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్న భావనతో కేంద్ర ఎన్నికల సంఘం భారీగానే కేంద్ర బలగాలను మోహరించింది. అయినా కూడా చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య గలాటాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్య ఎన్నికల పరిశీలకుడి హోదాలో ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన కౌశిక్ రెడ్డిని బీజేపీ శ్రేణులు అడ్డగించాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు తనకు అనుమతి ఉందని కౌశిక్ రెడ్డి గుర్తింపు కార్డును చూపినా.. బీజేపీకి చెందిన మహిళలు ఆయనను అడుగు ముందుకు వేయనీయలేదు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోగా.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి వెనుదిరగక తప్పలేదు. ఆ తర్వాత ఆయన మరోమారు పోలింగ్ కేంద్రానికి వచ్చినా.. బీజేపీ మహిళా శ్రేణులు ఆయనను అడ్డగించాయి. అయితే పోలీసుల సహకారంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మరోచోట గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్‌కు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆయనపై దాడి చేసినంత పని చేశాయి. ఊహించని ఈ పరిణామంతో ఆయన అక్కడి నుంచి తన కారులో పలాయనం చిత్తగించారు. మరికొన్ని చోట్ల కూడా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య స్వల్ప తగాదాలు చోటుచేసుకున్నాయి.
బద్వేల్‌లో బయటి వ్యక్తులు..?
ఇక ఏపీలోని సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలోనూ అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో మృతుడి సతీమణినే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకున్నాయి. వైసీపీ అభ్యర్థికి పోటీగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం మొదలైన పోలింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కమలయ్య తొలి గంటలోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బయటి వ్యక్తులు దర్శనమిస్తున్నారని, వీరిందరినీ వైసీపీ ఇతర నియోజకవర్గాల నుంచి తరలించిందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక మాదిరే బద్వేల్‌లోనూ బయటి వ్యక్తుల ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తోందని ఆ రెండు పార్టీలు సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే.. సంప్రదాయాన్ని గౌరవించి అభ్యర్థినే బరిలోకి దింపని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత గోవింద రెడ్డి విరుచుకుపడ్దారు. తమ అభ్యర్థిని బరిలోకి దింపని చంద్రబాబు.. తమ పార్టీ ఓట్లను బీజేపీకి మరలించేలా వ్యూహం రచించారని, చాలా చోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు కూర్చోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఓ చోట బీజేపీ ఏజెంట్ గా కూర్చున్న వ్యక్తిని వైసీపీ శ్రేణులు బెదరగొట్టి పంపేశాయి.
Must Read ;- పోతే 10 వేలు.. వస్తే లక్ష