ఈటల రాజేందర్ ఈ నెల 13న బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఆయన అనచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈటల రాజేందర్ కు నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికి, హారతులు పట్టారు. జై ఈటల జైజై ఈటల.. ఉద్యమం కదిలింది అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక రానుండటంతో.. ప్రజల మద్దతు కోసం ఈ పర్యటన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వీణవంకకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు రాజీనామా చేసి ఈటలకు మద్దతు ఇవ్వడం విశేషం.
భారీ ర్యాలీ తర్వాత కమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ మాట్లాడారు. కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో హుజూరాబాద్ కేంద్రంగా ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందంటూ వ్యాఖ్యానించారు. డబ్బులతో ప్రజలను మభ్యపెట్టలేరని, కేసీఆర్ కు ప్రజలే బుద్ది చెప్తారని, అందుకు హుజూరాబాద్ నాంది పలుకుతుందని అన్నారు.