పిల్ల పోయినా పురిటి కంపు పోలేదని మనకో సామెత ఉంది. ఇది అక్షరాలా లైగర్ సినిమాకు వర్తిస్తుంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా ఆ సినిమా తాలూకు మకిలి మాత్రం పూరిని వదలడం లేదు. నిన్న కాక మొన్న తెలంగాణ బయ్యర్లతో వివాదం, ఇప్పుడు ఈడీ విచారణ. అసలు ఈ సినిమాకు ఎంత ఖర్చయింది? ఎంత వసూలైంది? ఎవరెవరి పారితోషికాలు ఎంతెంత? ఇందులో పెట్టుబడులు పెట్టిన వారెవరెవరు? నల్లదనంతోనే ఈ సినిమా తీశారా? టైసన్ కు ఇచ్చిన పారితోషికం ఎంత? .. ఇవన్నీ ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నలే. ఎంతో వేగంగా హిట్ సినిమాలు తీయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ జీవితం ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతోందీ అంటే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు.
పూరి కనెక్ట్స్ తో ఎవెరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో కూడా తెలియదు. ఈ కనెక్ట్సే పూరీని ఇన్ని ఇబ్బందులు పాల్జేసిందన్నిది నగ్న సత్యం. ముఖ్యంగా పూరి – చార్మి సంబంధాలు అటు పూరి కుటుంబంలోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ చిచ్చు పెట్టాయి అన్నది నిర్వివాదాంశం. లైగర్ సినిమా ఫ్లాప్ దగ్గర్నుంచి పూరికి మనశ్శాంతి లేకుండా పోయింది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ లు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పూరి పోలీస్ కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ వివాదం సద్దుమణుగుతుందనకునే లోపే ఇప్పుడు పూరి, ఛార్మిలు ఈడీ విచారణకు హాజరు కావడం.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లైగర్ మీద దృష్టి పెట్టింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ. లైగర్ సినిమాలో ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారని, ఆమె సొమ్ము పెద్ద మొత్తంలో విదేశాల నుంచి పూరి, ఛార్మిలకు వెళ్లిందన్నది ప్రధానమైన ఆరోపణ. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ ఆరోపణ చేశారు. అసలు నల్లధనంతోనే సినిమాలు రూపొందుతున్నాయా? అన్న కొత్త ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తింది. అనేక రూపాల్లో ఉన్న నల్లధనం అంతా రకా రకాల ఫీల్డులకు తరలుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే పూరి, ఛార్మిల పరిస్థితి ఇప్పుడు ఏంటన్నది ప్రధానాంశం. ఎన్నో హిట్లు ఇచ్చిన పూరికి లైగర్ ఇచ్చిన చేదు అనుభవాన్ని మరచిపోలేరు.