భూ ఆక్రమణ ఆరోపణలు కారణంగా చూపుతూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ రెండు రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌పై, మంత్రి హరీష్‌పై స్వరం పెంచారు. ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. రెండురోజులగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి పీవీ జిల్లా పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అంశంపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సందర్భంలో ఈటల మరోసారి హరీష్‌పై కామెంట్లు చేశారు.
బానిసల్లా బతకమంటే తన వల్ల కాదంటూ..
ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా ఈటల మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో బానిసల్లా బతకమంటే తన వల్ల కాదని వ్యాఖ్యానిస్తూనే మంత్రి హరీష్ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అవమానాలు భరించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ స్పందిస్తూ ఈటలను విమర్శించారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఈటల మాట్లాడుతున్నారని, పార్టీని వీడేందుకు ఆయనకు ఉండే కారణాలు ఆయనకు ఉన్నాయని, కాని భావదారిద్ర్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీలో నిబద్దతతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నానని, పార్టీ ఆదేశాల తనకు పరమావధి అని, కేసీఆర్ తనకు గురువు, మార్గదర్శి మాత్రమే కాదని, తండ్రి సమానురని వ్యాఖ్యానించారు. తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకుని మాట్లాడడం విఫలయత్నమని వ్యాఖ్యానించారు. కాగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల ఓ ప్రశ్నకు సమాధానంగా ఆత్మగౌరవం ఎవరికి ఉందో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. భావదారిద్ర్యం ఎవరిదో తెలుసునని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాతలు పెట్టడం ఖాయమని, తమ నేతలపై వేధింపులకు పాల్పడుతన్నారన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన పెన్షన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమవైపు ఉన్న ఎంపీటీలు, జడ్పీటీసీలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, నియోజకవర్గంలో పచ్చగా ఉన్నా చిచ్చు పెట్టే ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఎప్పుడో ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, వావిలాల, చల్లేరును మండలాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో జరగబోయే ధర్మయుద్ధంలో పోలింగ్ బూతుల్లో అధికారులు సహకరించరని, వారంతా తమవైపు ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో తన ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి తనను ఓడించే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు నంగనాచి మాటలతో హుజూరాబాద్ నియోజకవర్గంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే రాజభక్తి చాటుకుంటే ఇబ్బందిలేదని, తనను విమర్శిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు
కాగా జూన్ 11నుంచి మంత్రులు హుజూరాబాద్ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు కేసీఆర్ టూర్ ఉంటుందని ప్రచారం జరుగుతుండగా,ఈనెల 11వ తేదీన మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పులతోపాటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌లు పర్యటించనున్నారు. వీరు కాకుండా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా తరచూ పర్యటించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
Must Read ;- పొట్టోడిని పొడుగోడే కొట్టాడు.. అది కూడా పోచమ్మ వరం కోసం!
తెరపైకి పీవీ జిల్లా..
హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో ఆ రాజీనామా ఆమోదం పొందితే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ కేంద్రంగా, పీవీ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అంశం ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఈటలపై పైచేయి సాధించాలనే వ్యూహంతోనే సెంటిమెంట్ రగిలించేలా పీవీ పేరుతో జిల్లాను ప్రతిపాదిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేసి పీవీ పేరు పెడితే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గౌరవం ఇచ్చినట్టు, ఈటలకు చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. కాగా 2018 నుంచే హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు డిమాండ్ వచ్చింది. పలు ఆందోళనలూ జరిగాయి. హుజూరాబాద్‌కు దాదాపు పది కిలో మీటర్ల దూరంలో పీవీ స్వగ్రామమైన వంగర గ్రామం ఉన్న నేపథ్యంలో సెంటిమెంట్ కూడా తమకు అనుకూలంగా ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తోందని చర్చ నడుస్తోంది. జూన్ 28న పీవీ జయంతి సందర్భంగా ఏదైనా నిర్ణయం వెలువడవచ్చనే ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పీవీ జిల్లాగా ఏర్పాటు చేసి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, వరంగల్ అర్బన్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, చిగురుమామిడి, భీమదేవరపల్లి, కమలాపూర్, ఎల్కతుర్తి మండలాలతో పాటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను కూడా కలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో హన్మకొండ పార్లమెంటు పరిధిలోనూ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మొత్తం మీద హుజూరాబాద్‌లో ఇటు ఈటల వ్యవహారం, అటు కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు.
Must Read ;- హుజూరాబాద్‌లో ఇక కురుక్షేత్రమే.. కేసీఆర్‌కు బుద్ధి చెబుతాం: ఈటల రాజేందర్