తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అనుసరించిన ముందస్తు వాటర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ.. ఎత్తిపోతల పథకాలను సద్వినియోగంచ చేసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని కరువు కోరల నుంచి కాపాడింది. 2026 అక్టోబర్ 15 నాటికి గోదావరి, కృష్ణా నదుల నుంచి ప్రధాన ఎత్తిపోతల ద్వారా ఏకంగా 123.31 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపడం విశేషం.
రాష్ట్రంలో నమోదైన లోటు వర్షపాతాన్ని భర్తీ చేయడంలో గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కీలక పాత్ర పోషించాయి. 113 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 24 పంపులు కలిగి, 8,500 క్యూసెక్కుల ఎత్తిపోతల సామర్థ్యం ఉన్న పట్టిసీమ పథకంలో ప్రస్తుతం 22 పంపుల ద్వారా నిరంతరం 7,788 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారు. ఒక్క పట్టిసీమ ద్వారానే ఇప్పటివరకు 61.74 టీఎంసీల నీటిని తరలించారు.
దీంతోపాటు పురుషోత్తపట్నం మొదటి దశ ద్వారా 23.57 టీఎంసీలు, రెండో దశ ద్వారా 9.43 టీఎంసీలు, తాడిపూడి ద్వారా 8.97 టీఎంసీలు, పుష్కర పథకం ద్వారా 0.33 టీఎంసీలతో కలిపి..కేవలం గోదావరి నది నుంచే మొత్తం 104.04 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.
రాయలసీమ సీమ ప్రాంతాలకు, సాగు నీటి అవసరాలకు కృష్ణా నదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు ఎంతగానో తోడ్పడ్డాయి. మల్యాల ఎత్తిపోతల పథకంలోని పంపుల ద్వారా హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 18.12 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 0.30 టీఎంసీలు కలిపి మొత్తం 18.42 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ముచ్చుమర్రి పథకం ద్వారా సేకరించిన 0.85 టీఎంసీలతో కలిపి కృష్ణా నది నుంచి మొత్తం 19.27 టీఎంసీలను తరలించి తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించింది.
అక్టోబర్ 16 నాటి నివేదికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 42.8% లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో 51.1% లోటు వర్షపాతం నమోదవగా, కోస్తాంధ్రలో 33.8% లోటు నమోదైంది. సాధారణంగా ఇలాంటి లోటు వర్షపాతం నమోదైన సమయాల్లో పంటలు ఎండిపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడటం సర్వసాధారణం. అయితే కూటమి ప్రభుత్వం ముందుచూపుతో పంపులను ఫుల్ కెపాసిటీతో నడిపి చెరువులు, రిజర్వాయర్లను నింపడంతో ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసి, ఎత్తిపోతల ద్వారా మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన ప్రణాళికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. వేసవి కాలంలో ఎదురయ్యే నీటి ఎద్దడిని కూడా అధిగమించేలా చెరువులు, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం కూటమి ప్రభుత్వం ముందుచూపునకు నిదర్శనం. భవిష్యత్తులో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, నీటిపారుదల రంగానికి చెందిన విద్యార్థులు అధ్యయనం చేసేలా ఆంధ్రప్రదేశ్ వాటర్ మేనేజ్మెంట్ కేస్ స్టడీగా నిలిచిందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.











