గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే పాత మలక్‌పేటలో పోలింగ్ రద్దు అయ్యింది. 26వ డివిజన్‌లో పార్టీ గుర్తులు తారుమారు కావడంతో పాత మలక్‌పేటలో పోలింగ్ రద్దు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. సిపిఐ పార్టీ నేతల ఫిర్యాదుతో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 26వ డివిజన్‌లోని బ్యాలెట్ పేపర్‌పై కంకికొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు ఉంది. దాన్ని గమనించిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తులు తారుమారు కావడంతో సిపిఐ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆ డివిజన్‌లో 6 నుంచి 7 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
ఇదేమీ సిత్రం…
పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు దాటుతున్నా పోలింగ్ శాతం దాదాపుగా 9 శాతం వరకే నమోదైంది. ఓటింగ్‌కు అంతగా ఆసక్తి చూపని గ్రేటర్ జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీల గుర్తులు తారుమారు కావడం ఓటర్లను నిరుత్సాహపరిచింది. ఏకంగా ఎన్నికల గుర్తునే మార్చేయడంతో అధికారులపై ఓటర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 26వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచారు. సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తు అయినటువంటి కంకికొడవలికి బదులుగా సీపీఐ(ఎం) ఎన్నికల గుర్తు సుత్తి కొడవలని బ్యాలెట్ పేపర్‌లో ముద్రించారు. ఇది గమనించిన పార్టీ నేతలు, ఓటర్లు ఆందోళన చేయడంతో పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తిరిగి రీపోలింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
రేపే పోలింగ్…
ఓల్డ్ మలక్ పేటలో గుర్తులు తారుమారు కావడంతో రద్దయిన పోలింగ్ ను రేపు రీ పోలింగ్ ను నిర్వహించేలా ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రీ పోలింగ్ అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ కు ఛాన్సు లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది.