టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడగొట్టడమే లక్ష్యంగా వైసీపీ చాలా వ్యూహాలే రచిస్తోంది. ఈ వ్యూహాల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా క్లిక్ కాలేదు గానీ.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా, చాలా మంది కీలక నేతలు సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వీరిలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే.. చంద్రబాబును ఎప్పుడో ఓడగొట్టేశామంటూ చెప్పుకుంటున్న వైనం అందరికీ తెలిసిందే. మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం పరిధిలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పిన పెద్దిరెడ్డి.. త్వరలో జరగనున్న కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలోనూ వైసీపీదే విజయమంటూ ముందే చెప్పేసుకున్నారు. అంతేకాకుండా కుప్పం మునిసిపాలిటీకి సంబంధించి వైసీపీ చైర్ పర్సర్ అభ్యర్థిగా ఓ యువ డాక్టర్‌ను కూడా ఆయన ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఆధారం చేసుకుని పెద్దిరెడ్డి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే.. వైసీపీ వాపును పెద్దిరెడ్డి బలుపుగా భావిస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఏళ్ల తరబడి చంద్రబాబుకు కంచుకోటగా నిలుస్తూ వస్తున్న కుప్పంలో ఆది నుంచి కూడా టీడీపీదే విజయం. అంతేకాకుండా చంద్రబాబు ప్రచారం చేయకుండానే అక్కడ వరుసబెట్టి గెలుస్తూ వస్తున్నారు. 2019లో చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
టీడీపీకి పెట్టని కోట కుప్పం
చిత్తూరు జిల్లాలో ఓ మూలకు విసిరేసినట్లుగా.. అటు కర్ణాటకతో పాటు ఇటు తమిళనాడుతోనూ సరిహద్దు కలిగిన కుప్పం.. 1962లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 13 సార్లు ఎన్నికలు జరిగితే.. నాలుగు సార్లు మినహా మిగిలిన 9 సార్లు కూడా టీడీపీనే విక్టరీ కొట్టేసింది. 1962లో టీడీపీనే పురుడు పోసుకోలేదు. ఆ ఎన్నికల్లో సీపీఐ విజయం సాధించగా.. 1967,72 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక టీడీపీ ఎంట్రీ ఇచ్చిన 1983 ఎన్నికలు మొదలుకొని ఇప్పటిదాకా అక్కడ టీడీపీనే విజయం సాధిస్తూ వస్తోంది. 1983,85 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగస్వామి నాయుడు గెలుపొందగా.. 1989లో చంద్రబాబునాయుడు పోటీ చేసి విక్టరీ కొట్టారు. ఇక అప్పటి నుంచి కుప్పంనే తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్న చంద్రబాబు అక్కడి నుంచే పోటీ చేస్తూ.. వరుసబెట్టి గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు విజయం ఏడో విజయంగా రికార్డులకు ఎక్కింది. ఏడు పర్యాయాలు అంటే.. దాదాపుగా 35 ఏళ్ల పాటు కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఏముందో, ఏ మూలన ఏ ఓట్లు ఉన్నాయో విస్పష్టమైన అవగాహన ఉందని చెప్పక తప్పదు. అసలు కుప్పంలో అభివృద్ధి సాధ్యమైందంటే.. అది చంద్రబాబు పుణ్యమేనని కూడా చెప్పక తప్పదు. ఈ కారణంగానే చంద్రబాబు ఓట్లేయమని అడగకున్నా కూడా కుప్పం ప్రజలు ఆయనను గెలిపిస్తూ వస్తున్నారు.
వైసీపీ వచ్చాకే ఈ తరహా ప్రచారం
కడప జిల్లా పులివెందులలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని గానీ, ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న ఆయన కుమారుడు జగన్‌ను గానీ ఎవరైనా ఓడిస్తారంటే అంత ఈజీగా నమ్మలేం కదా. మరి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ వైసీపీ నేతలు చెబుతుంటే నమ్మెదేలా? వైఎస్సార్ బతికుండగా, ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ ఈ తరహా ప్రకటనలు రాలేదనే చెప్పాలి. అయితే అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక జగన్ వైసీపీ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నాకే.. చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామంటూ ప్రకటనలు వినిపిస్తున్నాయి. వైసీపీ వచ్చాక కూడా వరుసగా రెండు పర్యాయాలు కుప్పంలో చంద్రబాబే గెలిచారు. అయినా కూడా వైసీపీ మాత్రం చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది. జగన్ ఈ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పజెప్పినట్టుగా ఉంది. ఈ కారణంగానే అవకాశం చిక్కిన ప్రతి సారి పెద్దిరెడ్డి పదే పదే కుప్పంనే టార్గెట్ చేస్తూ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అయినా స్థానిక సంస్థల ఎన్నికలంటే.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కడం ఆనవాయితీ కదా. ఆ ఆనవాయితీలో మరింతగా బలం పెరిగినట్టుగా చూపించుకునే దిశగా వైసీపీ సర్కారు.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలను ఏ రీతిన నిర్వహించిందో చూశాం కదా. మరి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసి.. ఆ వాపునే వైసీపీ బలుపుగా పెద్దిరెడ్డి భావిస్తున్నారేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏ క్షణమైనా కుప్పం పుర పోరు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కుప్పం మునిసిపాలిటీతో పాటుగా రాష్ట్రంలో ఎన్నికలు జరగని నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు మరో 11 పురపాలికల్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇటీవలే తన సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏ రీతిన దుర్మార్గాలకు పాల్పడిందన్న వైనాన్ని ఆయన తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో వైసీపీ దాడులకు గురైన పార్టీ శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మునిసిపల్ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఎగరని కొత్త జెండాను ఎగరనివ్వబోమని కూడా పార్టీ శ్రేణులు చంద్రబాబుకు తేల్చి చెప్పేశాయి. కుప్పం మునిసిపాలిటిగా ఏర్పడ్డ నాటి నుంచి కూడా టీడీపీకి చెందిన వారే చైర్మన్లుగా గెలుస్తూ వస్తున్నారని, ఈ దపా కూడా అదే రిపీట్ అవుతుందని కూడా పార్టీ శ్రేణులు చంద్రబాబుకు ఒకింత గట్టిగానే చెప్పేశాయి. వెరసి వైసీపీ వాపును చూసి దానినే తమ బలుపుగా చెప్పుకుంటున్న పెద్దిరెడ్డి.. చంద్రబాబు వ్యూహాల ముందు ఏమాత్రం నిలబడతారోనన్న దిశగా ఇప్పుడు కొత్త చర్చ మొదలైపోయింది.