తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రెండు గ్రాడ్యూయేట్ స్థానాల ఎన్నికల ప్రచారం మొత్తం నియామకాలే అజెండాగా సాగుతోంది.రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఉద్యోగాల కల్పన విషయంలో సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటున్నాయి. తాము 2014 నుంచి 1.32లక్షల ఉద్యోగాలు కల్పించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ నివేదిక విడుదల చేశారు. ఆ నివేదికలో తప్పులుంటే చర్చకు సిద్ధమని కూడా వ్యాఖ్యానించారు. కాగా ఆ నివేదికపై ప్రతిపక్షాలు మండి పడ్డాయి. అన్ని ఉద్యోగాలు కల్పించలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ ఆ సవాలును స్వీకరించి గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు కౌంటర్‌గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం జరిగాయి.
బీజేపీ వర్సెస్ కేటీఆర్..
అదే సమయంలో కేటీఆర్‌కి, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి మధ్య ట్వీట్ల వార్ జరిగింది. కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని, ఉస్మానియాకు చర్చకు రావాలని సవాలు విసిరారు సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్ తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో తాను చెబుతానని ట్వీట్ చేశారు. సోమవారం ఉదయం ఉస్మానియాకు వెళ్లిన రామచంద్రరావు తాను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నానని, ఎక్కడున్నావు మిస్టర్ కేటీఆర్? అని ట్వీట్ చేయడంతో పాటు బీజేపీ ఓ కార్టూన్ కూడా రిలీజ్ చేసింది. కేటీఆర్ స్పందిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాలు, జన్ దన్ ఖాతాలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చెప్పారు కదా.. వాటి అమలు ఎంతవరకు వచ్చిందో సమాచారం తీసుకునే పనిలో బిజీగా ఉన్నానని రిప్లై ఇచ్చారు. NDA అని చూస్తే No Data Available అని ట్వీట్ చేశారు. తాజాగా బీజేవైఎం టీపీపీఎస్సీ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరే కాకుండా ఇతర పార్టీల వారు, స్వతంత్రులు నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తతున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు..
ఎన్నికలన్నాక.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో నిరుద్యోగ సమస్యలపై ప్రచారంలో గళం ఎత్తుతున్నాయి. ప్రజల్లో ముఖ్యంగా యువతలో కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్దిచెప్పాలని కూడా పిలుపునిచ్చాయి. అంటే నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాల అజెండాతో ఎన్నికల ప్రచారం జరుగుతున్నా..మొత్తం ప్రభుత్వంపై వ్యతిరేకత చాటాలనే లక్ష్యంతో పార్టీలు ముందుకు వెళ్తున్నాయని చెప్పవచ్చు. పోనీ ఇప్పటి వరకు పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కూడా తాము ఏం సాధించారో పూర్తి స్థాయి నివేదికను ఓటర్ల ముందు పెట్టిన దాఖలాలూ లేవు. అన్నీ కలిపి ప్రభుత్వాలు చేసినవే తామూ చేశామని చెబుతున్నారు.
నోటిఫికేషన్ల కోసం చూస్తున్న యువత
నిరుద్యోగుల సమస్యలపై ఏం మాట్లాడారు..ఎప్పుడు ఎలా స్పందించారు అనే అంశంపై మాత్రం క్లారిటీ ఇచ్చేవారు తక్కువే. పోనీ నిరుద్యోగుల సమస్యలు లేవా..ఉద్యోగార్థులు లేరా అంటే..లక్షల సంఖ్యలో ఉన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతోపాటు రెండు మూడు సార్లు కోచింగ్ తీసుకుని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం చూస్తున్న యువత లక్షల్లోనే ఉన్నారు. వారిలో ప్రభుత్వ వ్యతిరేకతా ఉంది. ఇందుకు ఒక ఉదాహరణనూ ప్రస్తావించవచ్చు. కాకతీయ యూనివర్సిటీలో మంత్రి ఎర్రబెల్లిని బయటకు పంపడం, కేటీఆర్ చెప్పిన నివేదికపై ట్రోల్స్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు నిరుద్యోగ సమస్యలపై, ఉద్యోగాల భర్తీ అంశంపై మాట్లాడేందుకు జంకాల్సిన పరిస్థితి తలెత్తింది. అదే సమయంలో తాము గెలుస్తామని కూడా చెబుతున్నారు. అంటే ఓవైపు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి చెప్పే విషయంలో వెనుకంజ వేస్తున్నా.. వారి సమస్యల పరిష్కారానికి పాటుపడేలా ఏర్పడిన ఆయా ఎమ్మెల్సీల స్థానాల్లో గెలుస్తామని చెప్పడం ఏంటనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తం మీద గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు.. రాజకీయ పార్టీల అజెండాగా మారాయని చెప్పవచ్చు.