దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.. ఇప్పుడు తన చరిత్రలోనే ఎన్నడూ చూడని న భూతో న భవిష్యత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1994 ఎన్టీఆర్ ప్రభంజనం కావచ్చు.. 2014 చంద్రబాబు హయాం కావచ్చు.. కడప మేయర్ పీఠం, పులివెందుల మున్సిపాలిటీ వైఎస్ కుటుంబాన్ని దాటి బయటకు వెళ్లడం అనేదే జరగలేదు. కానీ, రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన ఆ ఉక్కు కోట.. ఇప్పుడు కొడుకు జగన్ నిర్లక్ష్యం, స్వయంకృతపరాధాల వల్ల సొంత గడ్డపైనే పునాదులతో సహా కదిలిపోతోంది..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో కష్టపడి, క్షేత్రస్థాయి నాయకులను గుండెల్లో పెట్టుకుని నిర్మించిన వైఎస్సార్ కంచుకోటను.. జగన్ మోహన్ రెడ్డి తన సొంత రాజకీయ నిర్ణయాలతో కూల్చేశారనే చర్చ మొదలైంది. వైఎస్ వివేకా హత్య కేసు పరిణామాలు, సొంత కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన వివాదాలు, షర్మిల-సునీతల ప్రచారంతో క్షేత్రస్థాయిలో సాంప్రదాయ ఓటు బ్యాంకు పూర్తిగా గందరగోళంలో పడింది. వీటికి తోడు, అధికారం పోగానే జగన్ ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితం కావడం, ద్వితీయ శ్రేణి నేతలను, కేడర్‌ను కనీసం పట్టించుకోకపోవడంతో కడపలో వైసీపీ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయిందనే చర్చ సాగుతోంది…
ఈ చారిత్రక మార్పుకు మొదటి ఘోర పరాభవం.. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలోనే ఎదురైంది. జగన్ సొంత నియోజకవర్గం, వైఎస్ కుటుంబ స్వగ్రామమైన పులివెందుల గడ్డపైనే YSRCP అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద పెను సంచలనం అంటున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా భయపడే పులివెందులలో.. టీడీపీ ఘనవిజయం సాధించి, జగన్ కంచుకోటకు తిరుగులేని దెబ్బ కొట్టిందనేది వాస్తవం.
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల సమరంలోనూ జగన్‌కు పరాభవమే మిగిలిందంటున్నారు. కడప మేయర్, పులివెందుల మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ పీఠం.. ఇలా ఏ ఒక్కటీ దక్కకుండా వైఎస్సార్సీపీ పూర్తిగా చేతులెత్తేసిందట. నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి క్షేత్రస్థాయి ఒత్తిళ్లను తట్టుకోలేక సైలెంట్ అయిపోగా, నాయకులంతా టీడీపీతో సర్దుబాటు ధోరణిలోకి వెళ్తున్నారని టాక్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో దశాబ్దాలుగా నడిచిన సామ్రాజ్యం.. జగన్ నాయకత్వ లోపంతో కడప చరిత్రలోనే తొలిసారిగా వారి చేతుల్లోంచి శాశ్వతంగా చేజారిపోయింది. చెల్లెళ్లు సునీత, షర్మిలతో రాజకీయ వైరం, జగన్ పతనానికి మరో కారణంగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. ఒక పార్టీ అధినేత స్వయంగా సొంత కుటుంబంతోనే పగ, ప్రతీకారాలతో రగిలిపోవడం ఏపీ రాజకీయాలలో ఇదే మొదటిసారి.. వైసీపీ చీఫ్ పొలిటికల్ డ్యామేజ్‌కి ఇది ఆజ్యం పోసిందనేది ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా పులివెందులలో జగన్ పరాభవం ఏరి కోరి తెచ్చుకున్నదే..మొత్తమ్మీద రాయలసీమ రాజకీయాల్లో వైఎస్ జగన్ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పడుతోందనడానికి కడపలో జరుగుతున్న ఈ రాజకీయ విప్లవమే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.











