బెజవాడ కనకదుర్గ గుడిలో దండుపాళ్యం గ్యాంగ్ చేరిందంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి ఈవో సురేష్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారంటూ మహేష్ ధ్వజమెత్తారు. దుర్గగుడిలో అవినీతిపై ఏసీబీ దాడులు నిర్వహించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరికీ తెలిసిందేన్నారు. దుర్గగుడి అవినీతి కేసులో తిమింగళాలను వదిలేసి, చిన్న చేపలను బలిచేశారని ఆయన విజయవాడలో విమర్శించారు.
కోట్లాది రూపాయల అవినీతి..
దుర్గగుడిలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని, ఈవోగా సురేష్ బాబు వచ్చాక దుర్గగుడి సరకుల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశారని, కోటి దాటితే రివర్స్ టెండర్ పిలుస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని పోతిన మహేష్ ప్రశ్నించారు. దుర్గగుడి కాంట్రాక్టులో పోలవరం ప్రాజెక్టు కన్నా ఎక్కువ కమీషన్లు కాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సరకుల కొనుగోళ్లలో కమీషన్లు దండుకున్నారని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పినా, ఈవో సురేష్ బాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహేష్ ప్రశ్నించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా సరకుల కోసం అంటూ రూ.50 కోట్లు అడ్వాన్సులుగా ఎలా చెల్లించారని పోతిన మహేష్ సూటిగా ప్రశ్నించారు. దుర్గగుడిలో దండుపాళ్యం గ్యాంగ్ తిరుగుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెజవాడలో హాట్ టాపిగ్గా మారాయి.
Must Read ;- దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు.. వెల్లంపల్లికి మూడినట్టేనా?