అందరిలోనూ హైటెన్షన్ రేకెత్తించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. గత నెల 30న పోలింగ్ జరగగా.. మంగళవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్‌లో ఇంకా రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగానే.. రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస యాదవ్ బరిలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున బల్మూరి వెంకట్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకలేకపోగా.. అధికార పార్టీ ప్రచార హోరును తట్టుకుని ఈటల విజయం సాధించారు. 22 రౌండ్లలో 20 రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికే గెల్లుపై 21 ఓట్ల మెజారిటీ సాధించిన ఈటల విజయం ఖరారైపోయింది.
ఆది నుంచి ఆధిక్యమే
మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తొలి రౌండ్లో 166 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన ఈటల.. ఆ తర్వాత వరుసబెట్టి ఏడో రౌండ్ దాకా ఆధిక్యం సాధిస్తూనే సాగారు. 8, 11వ రౌండ్లలో టీఆర్ఎస్కు కాస్తంత ఆధిక్యం దక్కగా.. ఆ వెంటనే తిరిగి ఈటలకే ఆధిక్యం లభిస్తూ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంతూరు అయిన వీణవంక మండలం హిమ్మత్ నగర్లోనూ ఈటలకు ఆధిక్యం రావడం గమనార్హం. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఈటలకే ఆధిక్యం లభించింది. ఇక టీఆర్ఎస్కు పెట్టని కోటగా ఉన్న హుజూరాబాద్ మండలంలోనూ ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరచారు. ప్రతి రౌండ్‌కు ఆధిక్యం కనబరుస్తూ సాగిన ఈటల రాజేందర్ 20 వ రౌండ్ పూర్తి కాగానే.. టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం ఖరారు చేసుకున్నారు.
ఏడో విక్టరీ ఈటలకు ప్రత్యేకం
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల ఓటమి ఎరుగని నేత కిందే లెక్క. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరు పర్యాయాలు పోటీ చేసిన ఈటల ఈజీగానే విక్టరీ సాధించారు. అయితే ఏడోసారి అక్కడ పోటీ చేసిన ఈటల.. తనను రాజకీయంగా ఎదిగేలా చేసిన టీఆర్ఎస్పైనే పోటీ చేయాల్సి వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన తాజా ఎన్నికలో టీఆర్ఎస్ అభ్య ర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటల ఏడో సారి గెలిచినట్లైంది. ఇప్పటిదాకా దక్కిన ఆరు విజయాల కంటే కూడా ఏదో సారి దక్కిన గెలుపే ఈటలకు ప్రత్యేకమని చెప్పక తప్పదు. మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగగా.. 8,11వ రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కగా.. మిగిలిన అన్ని రౌండ్లలో ఈటలకే ఆధిక్యం దక్కింది. ఈ ఎన్నికల్లో ఈటలకు 1.01,732 ఓట్లు రాగా, గెల్లుకు 78,977 ఓట్లు వచ్చాయి. వెరసి గెల్లుపై ఈటల 23,655 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్టైంది.
Must Read ;- టీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి?