వైసీపీ పాలన సాగిన ఐదేళ్లలో లెక్కలేనన్ని దారుణాలను ఏపీ ప్రజలు చూశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు… నిండు సభలో అవమానానికి గురై బయటకు వచ్చేశారు. ఎప్పుడూ నిండుగా, గంభీరంగా, హుందాగా కనిపించే చంద్రబాబు కంట కన్నీరు పెల్లుబికింది.. ఆయన భార్యను, ఆయన కుటుంబాన్ని ఎలాంటి మాటలతో వేధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన చవిచూడని సంఘటనలని జగన్ రాక్షస టీమ్ కళ్ల ముందు నిలిపింది..
అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకన్న విషయానికి వస్తే.. నాడు అసెంబ్లీలో వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి… మంత్రులుగానూ కొనసాగిన కొందరు నేతలు భువనేశ్వరిపై నీచపు వ్యాఖ్యలు చేశారు. ఇది చంద్రబాబు తట్టుకోలేక సభ నుంచి వాకౌట్ చేశారు. ఓ మహిళపై… అందులోనూ రాజకీయాలకు సంబంధం లేని మహిళపై అలాంటి వ్యాఖ్యలు వినిపించిన నాటి సభను చంద్రబాబు కౌరవ సభగానే అభివర్ణించారు. కౌరవ సభగా మారిపోయిన అసెంబ్లీని గౌరవ సభగా మార్చిన తర్వాతే తాను అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. నాడు చెప్పినట్లుగానే అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన వైసీపీని చిత్తు చేసి… గౌరవ సభలో చంద్రబాబు అడుగు పెట్టారు.
ఇదంతా ఓకే గానీ… మరి నాడు సభలో గానీ, సభ బయట గానీ… టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఎలా మాట్లాడాలన్న దానిపై పార్టీ అధిష్ఠానం ఏకంగా ట్రైనింగే ఇచ్చింది. ఈ శిక్షణ అంతా జగన్, జగన్ చుట్టూ ఉండే కోటరీ పర్యవేక్షణలోనే సాగింది… అసెంబ్లీలో ఏఏ అంశాల మీద ఎవరెవరు మాట్లాడాలి అన్న దానిపై పార్టీ పరంగా వైసీపీ నుంచి ఆదేశాలు వస్తే ఫరవా లేదు. అందుకు విరుద్ధంగా చంద్రబాబును ఎవరెవరు ఎలా తిట్టాలి? ఏ బూతులను వినియోగించాలి? ఎంతగా మానసిక వేదనకు గురి చేయాలి? అన్న విషయాలను పార్టీ అధిష్ఠానం స్లిప్పుల్లో రాసి మరీ తన ఎమ్మెల్యేలకు అందజేసింది తాడేపల్లి హై కమాండ్. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు కావడంతో… తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే… అధిష్ఠానం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆపై పోటీ చేసేందుకే అవకాశం దక్కదు. అందుకే కాబోలు వైసీపీ అదిష్ఠానం బరి తెగించి వ్యూహాలు రచిస్తే… వాటిని ఆ పార్టీ సభ్యులు అంతకంటే మరింతగా బరి తెగించి అమలు చేశారు. చంద్రబాబు లాంటి నేతలనే ఏడిపించారు.
ఇదేదో వైసీపీ అంటే గిట్టని పార్టీలో, ఆయా పార్టీలకు చెందిన నేతలో చెప్పిన మాటలు ఎంతమాత్రం కావు. స్వయానా… వైసీపీలో ఏళ్ల తరబడి కొనసాగి… ఆ పార్టీ అధికారం చెలాయించిన ఐదేళ్ల కాలంలో నామినేటెడ్ పదవిని పొంది… తాజాగా ఆ పార్టీ ఓటమిపాలై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన కారుమూరు రవిచంద్రారెడ్డి ఈ మాటలన్నీ చెప్పారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేసుకుని… పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఆ పార్టీ వైఖరిని విస్పష్టంగా చెప్పగలిగిన సత్తా గల నేతగా ఈయనకు మంచి పేరుంది. టీవీ డీబేట్లలో ఎక్కువగా కనిపించే ఈయన వైసీపీ తరఫున ఓ రేంజిలో పోరాటం చేశారనే చెప్పాలి. అయితే ఏనాడూ అసభ్యత జోలికి వెళ్లని నేతగానూ ఈయనకు గుర్తింపు ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ… వైసీపీ అధిష్ఠానం ఈయనపై శీతకన్నేయగా.., ఆ పార్టీలో ఇమడటం తన వల్ల కాదని గ్రహించి… ఆ నెక్ట్స్ మినిట్ వైసీపీకి రాజీనామా చేసి కేవలం గంట వ్యవధిలోనే బీజేపీలో చేరిపోయారు.
గత అయిదేళ్లలో వైసీపీలో జరిగిన తంతును రవిచంద్రారెడ్డి కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ప్రెస్ మీట్లకు ఎవరు వెళ్లాలనే దానిని నిర్ణయించే పార్టీ అధిష్ఠానం.. ఆయా ప్రెస్ మీట్లలో నేతలు ఏమేం మాట్లాడాలన్న దానిపై స్పష్టంగా స్లిప్పులు రాసిచ్చేదని ఆయన తెలిపారు. అసెంబ్లీలో కూడా విపక్ష నేతలను ఎలా టార్గెట్ చేయాలి? వారిని ఏ రీతిన తిట్టాలి? ఈ క్రమంలో ఎలాంటి బూతులు వాడాలి? అన్న విషయాలను కూడా అధిష్ఠానం స్లిప్పుల రూపంలో సూచనలు జారీ చేసిందని కూడా ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం నుంచి జారీ అయ్యే ఈ స్లిప్పులు జగన్ కు తెలియకుండా ఎలా వస్తాయని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని చెప్పిన రవిచంద్రారెడ్డి… దమ్ముంటే వైసీపీకి చెందిన ఏ నేత అయినా తనతో చర్చకు రావచ్చని సవాల్ విసిరారు.