‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి’ అన్నాడు గీతాచార్యుడు.
పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలు మనకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చేవే. ఒకరా ఇద్దరా.. మనకు ఆత్మీయులు అనుకున్నవారు ఎందరో కళ్లముందే కనుమరుగైపోతున్నారు.. తెరమరుగైపోతున్నారు. కరోనా మరణ మృదంగం మోగిస్తుంటే.. ఆ ధాటికి జర్నలిస్టులు ఎందరెందరో విగతజీవులవుతున్నారు. నిజంగా ఇది ఒక పరిక్షా సమయం.. పరీక్షిత్తు మహరాజులాగా ఒంటిస్తంభం మేడపై ఉన్నా కరోనా కనికరించేలా లేదు.. ఇక్కడ గుండె ధైర్యం ఒక్కటే మనిషికి శరణ్యం.
అక్క కోసం ఆవేదన..
జర్నలిస్టుల్లో టీఎన్ఆర్ గా ప్రసిద్ధుడైన తుమ్మల నరసింహారెడ్డి మరణం కూడా అలాంటిదే. ఓ వీడియోను రిలీజ్ చేసి ధైర్యవచనాలు చెప్పిన టీఎన్ఆర్.. కొద్ది వ్వవధిలోనే కన్నుమూశారు. ఇటీవలే ఆయన ‘నా ఈ చిన్న కోరిక తీరుస్తారా?’ అంటూ రాసిన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది. జీవితంలో ఐదు రోజులుగా లోఫీలింగ్ తో బాధపడుతున్నట్లు చెప్పారు. ‘మనసులో చెప్పలేనంత బాధ. అందుకే ఫేస్ బుక్ కి దూరంగా ఉన్నా. నా ప్రొఫెషనల్ విషయాలని తప్ప నా వ్యక్తిగత విషయాలని ఫేస్ బుక్ లో షేర్ చేసుకోడానికి నేను పెద్దగా ఇష్టపడను. కానీ ఈరోజు నాకు తప్పటం లేదు. అలా తప్పటానికి ఖచ్చితమైన కారణం ఉంది.
నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు అచ్చంగా అమ్మలాంటి వ్యక్తి, నా అక్కకి కరోనా పాజిటివ్ వచ్చి చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉంది. కరోనా పాజిటివే కదా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ క్యూర్ అవుతుంది కదా అని మీరనుకోవచ్చు.. కానీ పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది. మొన్న ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ కొత్తపేట్ లోని ఒమిని హాస్పిటల్ లో ఎడ్మిట్ అయింది. ప్రస్తుతానికి అక్క ఐ.సి.యు. లో వెంటీలేటర్ మీద ఉంది. డాక్టర్ ఛాన్సెస్ కొంచెం తక్కువే అని చెప్పారు. పుట్టినరోజు విషెస్, పండగ విషెస్, గుడ్ మార్నింగ్ మెసేజెస్ నేను పెద్దగా ఫాలో అవ్వను. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికైనా చెబుతానేమోగానీ పెద్దగా వాటికి ప్రాముఖ్యత ఇవ్వను. అది నా వ్యక్తిగత నైజం మాత్రమే. వాటి గురించి పక్కనపెడితే ఇప్పుడు నేను ఈ పోస్ట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే..
ప్రార్థనలకు దేవుడు కరుణించలేదు
ఈ సృష్టికి సంబంధించి నేనొక విషయాన్ని చాలా బలంగా నమ్ముతాను. మన గురించీ, మన ఫ్యామిలీ గురించి, మన వాళ్ళ గురించి కాకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థిస్తే మాత్రం ఆ ప్రార్థనలు ఖచ్చితంగా నెరవేరిపోతాయ్ అని. మనకి ఎలాంటి దగ్గరి సంబంధం లేని ఎవడికోసమో మనిషి చేసే ప్రార్థనకి బలమెక్కువ.. ఆ ప్రార్థనలు ఓ సమూహంగా, ఓ గుంపుగా వస్తే వాటికి ఇంకా ఇంకా బలమెక్కువ. మా అక్క తొందరగా కోలుకోవాలని ఒక్క పది సెకన్లు మీ అందరూ మనస్పూర్తిగా విష్ చెయ్యాలన్నది నా కోరిక.. అంతే.
ఈ కింది రెండు లైన్లు మృత్యుంజయ మంత్రం.. ‘‘ఓం త్రయంబకం యజామహే.. సుగంధిం పుష్టివర్ధనం.. ఉర్వారుకమివ బంధనాత్.. మృత్యోర్ముక్షీయమామృతాత్..ఓం నమశివాయ…’’ ఇది చాలా బలమైన మంత్రం. మీరు విష్ చేస్తున్నప్పుడు ఈ రెండు లైన్లు మనసులో అనుకోవాలని నా మనవి. ఈ మంత్రాల మీద,మతాల మీద నమ్మకం లేని వాళ్ళు జస్ట్ మనసులో విష్ చెయ్యండి చాలు. సమూహంగా వచ్చే మీ ప్రార్థనలతోనైనా అక్క లేచి వస్తుందనే ఆశ.. ఏ చిన్న ఆశని కూడా నేను వదిలిపెట్టదల్చుకోలేదు. జరగరానిదేదైనా జరిగితే మీతో ఈ విషయం పంచుకోలేదే, పంచుకుని ఉంటే నాకు మంచి జరిగి ఉండేదేమో అనే రిగ్రెట్ నాకు ఉండకూడదు.
ఈ పోస్ట్ ని పిచ్చితనంగా భావించేవాళ్ళు,కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉండొచ్చు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో… కానీ ఇది నా నమ్మకం.. నా అమ్మలాంటి అక్క బ్రతకాలి అనే బలమైన కోరిక తప్ప నా మనసుకింకేం అనిపించట్లేదూ,చెవులకేం వినిపించట్లేదూ,కంటికేం కనిపించట్లేదు. ఆ బలమైన కోరికే “ఎవరేమనుకున్నా పర్వాలేదు” అనుకునేలా చేసి నన్ను ఈ పోస్ట్ పెట్టేలా చేసింది.. ఒక్క పది సెకన్లు మీవి కావనుకుని నాకోసం మీ మనసులోనే మనస్పూర్తిగా అనుకోండి చాలు. మనం ఎదుటివాడి గురించి ప్రార్థించే ప్రార్థనలు ఆ ప్రార్థించేవాడికి తప్ప రెండో వ్యక్తికి తెలియకూడదు. అప్పుడే ఆ ప్రార్థనలకి బలం అనేది నా నమ్మకం.
అసలు ఎదుటివాడి గురించి ప్రార్థించాలంటే వాడి కష్టమేంటో మనకు తెలియాలి కదా. అందుకే.. అది మీకు తెలియాలనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పోస్ట్ పెట్టా. సింపతీ కోరుకోవడానికి మాత్రం కాదు.. దయచేసి అన్యదా భావించకండి… పోస్టులో ఏదైనా తప్పుగా రాసి ఉంటే క్షమించండి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేద్దామనుకుని సెండ్ బటన్ కొడదామని వెళ్ళిన వేళ్ళు ఆగిపోయాయ్. ఇలా పోస్ట్ చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అని ఆగాను.. 24గంటల తర్వాత బాగా ఆలోచించాక ఎవరేమనుకున్నా పర్వాలేదని ధైర్యం చేసి ఈరోజు ఈ పోస్ట్ పెడుతున్నాను.
ఇది నా చివరి ప్రయత్నం…ఈ పోస్ట్ ఇలా పెట్టడం కరెక్టో కాదో కూడా తెలీని మానసిక స్థితిలో ఉన్నాను ప్రస్తుతం.. ఏదో…మంచి జరుగుతుందేమో అనే అమాయకత్వంతో కూడుకున్న చిన్న తాపత్రయం నాది తను బతికితే చాలూ అనే చిన్న స్వార్థం ఇది’అంటూ ఆయన ఫేస్ బుక్ లో ఈ పోస్టు పెట్టారు. అలాంటి టీఎన్ఆర్ అక్క కోసం పడ్డ తాపత్రయం మాటేమోగాని తానే లేకుండా పోతానని మాత్రం ఊహించలేకపోయారు.