జాతకాలంటే అందరికీ ఎంతో నమ్మకం. ఎన్నో రకాల జాతకాలు మనకు ఉన్నాయి. మన బొటన వేలి ముద్రతో జాతకాలు చెప్పే విధానాన్ని నాడీ జాతకం అంటారు. మన జాతకాలన్నీ తాళ పత్రాల్లో రాశి ఉంటాయని, వారి దగ్గరకు వెళితే తమ జాతకం మొత్తం తెలిసిపోతుందని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు.
నిజంగా ఇలా జరుగుతుందా? దీనికి జ్యోతిష శాస్త్రం దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాడీ జాతకం పేరు వినగానే అందరికీ గుర్తుచ్చే ఊరు పేరు వైదీశ్వరన్ కోయల్. తమిళనాడులో ఈ ఊరు ఉంది. ఇక్కడ కొందరు జ్యోతిష్కుల దగ్గర ఉన్న తాళ పత్రాల్లో అందరి జాతకాలు రాసి ఉంటాయన్న ప్రచారం ఉంది. అలాగే హర్యానాలోని హోషియర్ పూర్ లో కూడా ఇలాంటి జాతకాలు చెప్పేవారు ఉన్నారన్న ప్రచారం ఉంది. కర్నాటకలోని కోడిమెట్ అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిషం చెబుతారు. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వెళ్లి జ్యోతిషం చెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలు ఏమిటన్నది తేలాల్సి ఉంది. జ్యోతిష శాస్త్రం నిజమే కానీ జ్యోతిషం పేరుతో రకరకాల మోసాలు చేసే వారు కూడా ఉన్నారు. ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోవడం సామాన్య ప్రజలు తెలుసుకోవడం కష్టం.
వైదీశ్వరన్ కోయల్ లో ఏంజరుగుతుంది?
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వైదీశ్వరన్ కోయల్ ఉంది. ఇక్కడ చోళ రాజులు కట్టిన వైదీశ్వరుని ఆలయం ఉంది. అందుకే దీనికి వైదీశ్వరన్ కోయల్ అనే పేరు వచ్చింది. కోయల్ అంటే గుడి. ఈ దేవాలయాన్ని 1600 సంవత్సరాల క్రితం నిర్మించారు. అంగారకుడికి ఒకసారి జబ్బు చేసిందట. ఆయనకు వైద్యం చేయడానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయిల్ అనే పేరు వచ్చిందన్నది పురాణ కథ. ఇక్కడ అగస్త్య మహాముని రాసిన నాడీ గ్రంథాలు కొందరు జ్యోతిష్కుల వద్ద ఉన్నట్లు విపరీతమైన ప్రచారం ఉంది.
అక్కడికి వెళ్లి జాతకాలు చెప్పించుకున్నవారు బాగా చెప్పారు కొందరంటే, మన జాతకాన్ని మన నోటితోనే చెప్పించుకుని మనకు చెబుతుంటారని, అంతా పచ్చిమోసమని చెప్పేవారూ కొందరున్నారు. ఈ ఊరిలో ఇలా నాడీ జ్యోతిషం చెప్పే కుటుంబాలు ఓ 60 వరకూ ఉన్నాయి. ఒకప్పుడు ఒకే ఒక్క కుటుంబం మాత్రమే ఇక్కడ జ్యోతిషం చెప్పేది. అది విస్తరిస్తూ ఈరోజున 60 కుటుంబాలకు పాకింది. పైగా అది కుటీర పరిశ్రమగానూ మారింది. గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కిరాల వేదవ్యాసగారు తను రాసిన ఓ పుస్తకంలో వైదీశ్వరన్ కోయిల్ లోని నాడీ జ్యోతిషం గురించి రాశారు. వైదీశ్వరన్ కోయల్ లోని పూసముత్తు అనే ఆయన తన గురించి కచ్చితమైన ఫలితాలు చెప్పారని రాశారు.
పూసముత్తు వారసులు చెప్పేదానిలో నిజానిజాలెంత?
అదే పూసముత్తు ఆ తర్వాత మరోసారి వెళ్లినప్పుడు చెప్పిన ఫలితాలు ఏదీ జరగలేదని కూడా ఆయన రాశారు. అసలు ఇక్కడ తాళ పత్రాలు వీరు తయారు చేసి అందులో జాతకాలు రాసి ఉన్నట్టు జనాన్ని నమ్మిస్తున్నారన్న ప్రచారం ఉంది. దీని మీద తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ పరిశోధనాత్మక కథనం చేసింది. మా లియో ఛానెల్ తరఫున మేము జరిపిన పరిశోధనలోనూ అక్కడ నాడీ జ్యోతిషం పేరుతో మోసం జరుగుతోందని తేలింది.
ప్రస్తుతం అక్కడ పుసముత్తు ఇద్దరు కొడుకులు ఆయన వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నారు. అలాగే ఆర్ముగం అనే మరో నాడీ జ్యోతిష వేత్త కుమారుడు శివస్వామి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వైదీశ్వరన్ కోయిల్ అనే ఆ ఊరి మనుగడ కేవలం నాడీ జ్యోతిషం మీదనే ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. అక్కడ పురాతన వైదీశ్వరుడి ఆలయం ఉన్నా జ్యోతిషం కోసం వచ్చేవారే ఎక్కువ. పూసముత్తు కుమారుడు ఏమంటారంటే ‘తమదే అసలైన నాడీ జోస్యం… మిగతా వారంతా బోగస్’ అని. అసలక్కడ జ్యోతిష్కులు అంతా మోసగాళ్లేనని, కాకపోతే జ్యోతిషం పేరుతో జరిగే వ్యాపారం వల్ల ఆ ఊరు బాగా అభివృద్ది చెందింది.
పూసముత్తు కుమారుల దగ్గర దాదాపు 20 మంది నాడీ రీడర్లు ఉన్నారు. వారితో జాతకం చెప్పించుకుంటే 5000 వరకు వసూలు చేస్తున్నారు. శివస్వామి మాత్రం వారి రీడర్లతో నాడీ చెప్పించుకుంటే 6000 తీసుకుంటున్నారు. శివస్వామి మాత్రమే జాతకం చెప్పాలంటే 25000 ఇవ్వాలట. ఇంతపెద్ద జాతకాల మాఫియా వైదీశ్వరన్ కోయిల్ లో నడుస్తోంది. ముఖ్యంగా మన తెలుగువారు కూడా అక్కడికి వచ్చి చేతి చమురు వదిలించుకుని పోతున్నారు. మనల్ని ఈ జ్యోతిష్కుల దగ్గరికి తీసుకువెళ్లే బ్రోకర్లకు వెయ్యి రూపాయల వరకూ ముడుతుందట. మేం అక్కడి స్థానికుల్సి వాకబు చేస్తే తేలింది ఏమిటంటే అందరూ చేసేది మోసమేనని.
కుంభకోణంలో తాళ పత్రాలు ఉన్నాయా?
కొంతమంది మాత్రం కుంభకోణం, తంజావూరు వెళితే అక్కడ అసలైన నాడీ పత్రాలు లభిస్తాయని అన్నారు. దాంతో మా బృందం అక్కడికి కూడా వెళ్లింది. ఆసియాలోనే అతి పెద్దదయిన తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ నుంచి నాడీ జ్యోతిష తాళ పత్రాలు వస్తాయని చెప్పడంతో అక్కడి వెళ్లి వాకబు చేస్తే తేలింది ఏమిటంటే అది కూడా అబద్ధం. అసలక్కడ అలాంటి తాళపత్రాలే లేవట. పురాతన తాళ పత్రాలు ఉన్నాయి కాని అవి నాడీ గ్రంథాలు మాత్రం కావు. పైగా ఆ తాళ పత్రాలు పాడైపోకుండా కొన్ని రసాయనాలతో వాటిని కాపాడుతున్నారు.
సరస్వతీ మహల్ లైబ్రరీలో తాళ పత్రాలను భద్ర పరచడానికి రసాయనాలు వాడుతూ వాటిని కాపాడుతున్నారు. దానికోసం ఎంతో మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ పత్రాలు పాడైపోతాయి. శ్రీకృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద మూల ప్రతి కూడా అక్కడ ఉంది. మరి ఇలాంటి రసాయనాలు ఏమీ వాడకుండా వైదీశ్వరన్ కోయిల్ లోని తాళ పత్రాలతో ఎలా జాతకం చెబుతున్నారు? ఇది పెద్ద ప్రశ్న. ఆ లైబ్రరీ సిబ్బంది మనకు చెప్పిన సమాచారం ప్రకారం ఆ లైబ్రరీలో నాడీ జ్యోతిష తాళ పత్రాలు అంటూ ఏమీ లేవట. పైగా వైదీశ్వరన్ కోయల్ లో కూడా జ్యోతిషం పేరుతో చేసేది మోసమేనని అంటున్నారు.
వైదీశ్వరన్ కోయిల్ లో ఒక కుటుంబంతో ప్రారంభమైన నాడీ జ్యోతిషం ఇప్పుడు అనేక కుటుంబాలకు పాకింది. ఇలాంటి జాతకం కోసం మీరు మాత్రం అక్కడి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. పూసముత్తు కుటుంబం 5వ తరం వారు ఈ జ్యోతిషాన్ని అందిస్తుంటే, కొందరు 3వ తరం జ్యోతిష్కులుగా, మరి కొందరు 4వ తరం వారిగా చలామణి అవుతున్నారు. ఇలా ఈ ఊరులో కుటీర పరిశ్రమగా జ్యోతిషం అనేది మారిపోయింది. ఇక్కడ జ్యోతిషం వల్లే మేం ఇలా బతుకుతున్నాం. మా పొట్ట కొట్ట వద్దు అనే ధోరణిలో అక్కడి వ్యాపారలు మాట్లాడుతున్నారు. కాబట్టి దూరపు కొండలు నునుపు అనే సామెతను రుజువు చేస్తోంది ఈ నాడీ జ్యోతిషం.











