మలయాళంలో ఫాహద్ ఫాజిల్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ కు కూడా. అక్కడ మల్లు అర్జున్ గా బన్నీ అభిమానులు ఆరాధిస్తారు. అందుకేనేమో బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లో ఫాహద్ ఫాజిల్ ను ఓ కీలక పాత్రలోకి తీసుకున్నారు. తెలుగులో మొదటి ప్రయోగం ఇది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే. ఇప్పటికే ఫాహద్ సినిమాలు తెలుగులో అనువాదమై ఆయనకు ఇక్కడ కూడా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్పకు మలయాళంలోనూ హైప్ వచ్చేసింది.
ఈ సినిమాలో ఫాహద్ లుక్ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు జవాబు కూడా ఈరోజు వచ్చేసింది. అతని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రెండు భాగాలుగా పుష్ప రూపొందుతున్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటిస్తుంటే, ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా ఫాహద్ వస్తున్నడని చిత్ర యూనిట్ పేర్కొంది. నిజానికి ఈ సినిమాలో విలన్ ఎవరు? హీరో ఎవరు అన్నది చెప్పడం కూడా కష్టమే.
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే అల్లు అర్జున్ ను హీరో ఎలా అనుకోగలం? అలాగే అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించే పోలీస్ అధికారిని విలన్ అనుకోవడం కూడా కష్టమే. ఈ సినిమాలో ఫాహద్ లుక్ చూస్తుంటే గుండు మీద గాటుతో తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నాడు. మొత్తానికి ఫాహద్ పాత్ర నెగిటివ్ షేడ్స్ అన్నది స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ కు ధీటైన విలన్ ను ఎంపిక చేశారని చెప్పవచ్చు.
ఊరమాస్ లారీ డ్రైవర్ అయిన పుష్పరాజ్ కూ, క్రూరత్వం మూర్తీభవించిన భన్వర్ సింగ్ కూ మధ్య ఫైట్ ఎలా ఉంటుందన్నది చూడాల్సిందే. ఇందులో హీరోయిన్ గా రష్మిక, ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అజయ్, సునీల్, అనసూయ పోషిస్తున్నారు. పుష్ప మొదటి భాగానికి ‘పుష్ప – ది రైజ్’ అనే పేరును నిర్ణయించినట్టు సమాచారం. దాదాపు మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.
Must Read ;- బన్నీ, సూర్య, యశ్.. ఈ ముగ్గురిలో బోయపాటి మూవీ ఎవరితో?











